LOADING...
Intel layoffs: భారీ షాక్.. 25,000 మందిని తొలగించనున్న ఇంటెల్!
భారీ షాక్.. 25,000 మందిని తొలగించనున్న ఇంటెల్!

Intel layoffs: భారీ షాక్.. 25,000 మందిని తొలగించనున్న ఇంటెల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 27, 2025
03:34 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇంటెల్ సంస్థ భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. సంస్థ పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా 25,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించేందుకు యోచిస్తోంది. ఈ విషయాన్ని 'ది న్యూయార్క్ టైమ్స్' నివేదిక ఆధారంగా వెల్లడించింది. 2025 చివరి నాటికి తన మొత్తం ఉద్యోగుల సంఖ్యను 75,000కి పరిమితం చేయాలనే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టనుంది. ప్రస్తుతం సంస్థలో 1,08,900 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటికే 2025 ఏప్రిల్ నుంచి 15,000 మందిని తొలగించిన ఇంటెల్, ఇది మొత్తం ఉద్యోగులలో సుమారు 15 శాతం కోతకి సమానం. ఇక 2025 రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించే సమయంలో ఉద్యోగుల తొలగింపును సంస్థ అధికారికంగా ధృవీకరించింది.

Details

తాత్కలికంగా ప్రాజెక్టులు నిలిపివేత

ఇంటెల్ కొత్త సీఈఓ లిప్ బు టాన్ మాట్లాడుతూ, కంపెనీ ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడుల నేపథ్యంలో కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తోందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో జర్మనీ, పోలాండ్‌లలో నిర్మించనున్న కొత్త ఫ్యాక్టరీ ప్రాజెక్టులను తాత్కాలికంగా ఆపివేసింది. అంతేకాదు కోస్టారికాలోని కొన్ని కార్యకలాపాలను వియత్నాం, మలేషియాల‌కు తరలించే ప్రయత్నంలో ఉంది. ఈ మార్పులు నిర్వహణ ఖర్చులు తగ్గించేందుకు ఉపయోగపడతాయని భావిస్తున్నారు. గ్లోబల్ చిప్ మార్కెట్‌లో దాదాపు అధిపత్యం చెలాయించిన ఇంటెల్, ఇప్పుడు తన స్థానాన్ని కోల్పోతోంది.

Details

వెనుకబడిపోయిన ఇంటెల్

1990ల పర్సనల్ కంప్యూటర్ బూమ్ సమయంలో మైక్రోప్రాసెసర్ రంగంలో అగ్రగామిగా నిలిచిన ఈ సంస్థ స్మార్ట్‌ఫోన్ యుగం ప్రారంభమైన తర్వాత మార్కెట్‌లో తన ప్రభావాన్ని కోల్పోతూ వచ్చింది. ఇక ఇటీవలి కాలంలో ఎన్విడియా వంటి సంస్థలు వేగంగా ఎదగడం, ఇంటెల్‌ను మరింత ఒత్తిడిలోకి నెట్టేసింది. అలాగే ఏఐ చిప్ సెగ్మెంట్‌లో కూడా ఇంటెల్ వెనుకబడిపోయింది.