LOADING...
Apple CEO Change: యాపిల్‌లో కొత్త సీఈఓ కోసం హంట్.. టిమ్ కుక్‌ స్థానంలో ఎంపిక కోసం ప్రయత్నాలు!
యాపిల్‌లో కొత్త సీఈఓ కోసం హంట్.. టిమ్ కుక్‌ స్థానంలో ఎంపిక కోసం ప్రయత్నాలు!

Apple CEO Change: యాపిల్‌లో కొత్త సీఈఓ కోసం హంట్.. టిమ్ కుక్‌ స్థానంలో ఎంపిక కోసం ప్రయత్నాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 15, 2025
12:49 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ టెక్ రంగంలో కీలక సంస్థ ఆపిల్‌ (Apple) నాయకత్వంలో భారీ మార్పుకు వేదిక సిద్ధమవుతున్నట్లు సమాచారం. కంపెనీ సీఈవో టిమ్‌ కుక్‌ (Tim Cook) వచ్చే ఏడాదిలోపు తన పదవి నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు 'ఫైనాన్షియల్ టైమ్స్' వెలువరించిన కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వారసుడి ఎంపిక ప్రక్రియను యాపిల్‌ బోర్డు, సీనియర్‌ మేనేజ్‌మెంట్‌ వేగవంతం చేసినట్లు తెలుస్తోంది.

Details

వారసుడిగా ఎవరు?

సుమారు 14 ఏళ్లుగా యాపిల్‌ను సీఈవోగా నడిపిస్తున్న కుక్‌ స్థానంలోకి రాబోయే వ్యక్తి ఎవరు అన్న దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. ప్రస్తుతం హార్డ్‌వేర్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ఉన్న 'జాన్‌ టర్నస్‌ (John Ternus) పేరు అత్యంత బలంగా వినిపిస్తోంది. దాదాపు 24 ఏళ్లుగా యాపిల్‌తో అనుబంధం కొనసాగిస్తున్న టర్నస్‌కు కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం కంపెనీ అంతర్గత వర్గాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఈ విషయంపై ఇంకా తుది నిర్ణయం వెలువడలేదు.

Details

పనితీరుతో సంబంధం లేదని యాపిల్‌ స్పష్టం

సీఈవో మార్పు కంపెనీ పనితీరుతో ఎలాంటి సంబంధం లేదని యాపిల్‌ వర్గాలు స్పష్టంచేశాయి. ఈ ఏడాది చివరికి ఐఫోన్‌ విక్రయాలు అత్యుత్తమ స్థాయిలో ఉండే అవకాశం ఉందని అంచనా. సాధారణంగా జనవరి చివర్లో యాపిల్‌ త్రైమాసిక ఫలితాలు ప్రకటిస్తుంది, వీటిలో పండుగ సీజన్‌ అమ్మకాల వివరాలు కీలకం. ఆ రిపోర్ట్‌ విడుదలైన తర్వాత కొత్త సీఈవోపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. జూన్‌లో జరిగే డెవలపర్‌ కాన్ఫరెన్స్‌, సెప్టెంబర్‌లో జరిగే ఐఫోన్‌ లాంచ్‌ వంటి ప్రధాన ఈవెంట్ల దృష్ట్యా, ఏడాది ప్రారంభంలోనే నాయకత్వ బదిలీ జరిగితే కొత్త సీఈవోకి కార్యక్రమాల సిద్ధతకు తగిన సమయం లభిస్తుందని భావిస్తున్నారు.

Details

కుక్‌ నాయకత్వ విజయాలు 

ప్రస్తుతం 65 ఏళ్ల వయస్సు కలిగిన టిమ్‌ కుక్‌ 2011లో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ మరణించిన కొద్ది నెలలకే ఆయన కంపెనీని నడిపే బాధ్యతలు స్వీకరించారు. కుక్‌ నేతృత్వంలో యాపిల్‌ మార్కెట్‌ విలువ 350 బిలియన్ డాలర్ల నుంచి నాలుగు ట్రిలియన్ డాలర్లకు పెరిగి సరికొత్త రికార్డు సృష్టించింది.

Details

లోపలి వ్యక్తికే అవకాశం — యాపిల్‌ వ్యూహం

సీఈవో పదవి అంతర్గతంగా పనిచేస్తున్న వ్యక్తికే ఇవ్వాలని తాను కోరుకుంటున్నట్లు కుక్‌ గతంలో వెల్లడించారు. వారసత్వ ప్రణాళికలు స్పష్టంగా ఉన్నాయని కంపెనీ తెలిపింది. ఇతర టెక్‌ సంస్థలతో పోలిస్తే ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI) రంగంలో యాపిల్‌ కొంత వెనుకబడి ఉందన్న విమర్శల మధ్య, హార్డ్‌వేర్‌ విభాగం నుంచి నాయకుడిని ముందుకు తేవడం కంపెనీ వ్యూహాత్మక నిర్ణయంగా పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.