LOADING...
Women Powerful Leaders: 97 మందితో హురున్‌ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల 
97 మందితో హురున్‌ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల

Women Powerful Leaders: 97 మందితో హురున్‌ ఇండియా మహిళా నాయకుల జాబితా విడుదల 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 05, 2025
08:36 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ ఆర్థిక రంగాన్ని ప్రభావితం చేస్తున్న 97 మంది శక్తిమంత మహిళలతో కూడిన 2025 కాండెరే-హురూన్‌ ఇండియా మహిళా నాయకుల జాబితాను హురూన్‌ సంస్థ తాజాగా విడుదల చేసింది. తొలిసారి విడుదల చేసిన జాబితాలో ఆర్థిక సేవలు, టెక్నాలజీ, దాతృత్వం, కళలు, స్టార్టప్ రంగాలకు చెందిన ప్రముఖులు చోటు దక్కించుకున్నారు. రంగాల వారీగా 10 మంది చొప్పున ఎంపిక చేసిన ఈ జాబితాలో బ్యాంకింగ్‌ విభాగానికి శాంతి ఏకాంబరం, టెక్ రంగానికి రాధా వెంబు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సింగ్‌లో మృణాల్‌ పంచాల్‌ వంటివారు ఉన్నారు.

వివరాలు 

ఆర్థిక విలువ ఆధారంగా అగ్రస్థానంలో శాంతి ఏకాంబరం 

రూ.3.81 లక్షల కోట్ల విలువ కలిగిన కోటక్ మహీంద్రా బ్యాంక్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా శాంతి ఏకాంబరం వ్యవహరిస్తున్నారు. జాబితాలో ఆమెకు అగ్రస్థానం లభించింది. ఆమె తరువాతి స్థానంలో రూ.1.44 లక్షల కోట్ల విలువైన పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌,మేనేజింగ్‌ డైరెక్టర్‌ పర్మీందర్‌ చోప్రా నిలిచారు. రిలయన్స్‌ రిటైల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఈషా అంబానీ ఆరో స్థానాన్ని ఆక్రమించారు. స్టార్టప్, ఇన్‌ఫ్లుయెన్సింగ్ రంగాల్లో మృణాల్‌ పంచాల్ అగ్రగామి మృచా బ్యూటీ అనే అంకుర సంస్థను స్థాపించిన మృణాల్‌ పంచాల్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ వ్యవస్థాపకులలో మొదటి స్థానాన్ని పొందారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో 55 లక్షల ఫాలోవర్లను కలిగి ఉన్నారు.

వివరాలు 

రాధా వెంబు, జోహో సహ వ్యవస్థాపకురాలిగా తొలి తరం నాయకురాలిగా 

తొలితరం సంపత్తిని సృష్టించిన నేతగా జోహో సంస్థ సహ వ్యవస్థాపకురాలైన రాధా వెంబు నిలిచారు. ఆమె సంపద విలువ రూ.55,300 కోట్లు. ఆమె తరువాతి స్థానంలో రూ.48,900 కోట్ల విలువతో అరిస్టా నెట్‌వర్క్స్‌ సీఈఓ జయశ్రీ ఉల్లాల్‌ నిలిచారు. తమ తమ వ్యాపార సంస్థలను విలువలతో అభివృద్ధి చేసిన 10 మంది స్వయంసంపన్న మహిళలు ఈ జాబితాలో ముఖ్యంగా పేర్కొనబడ్డారు.

వివరాలు 

భవిష్యత్‌ నేతల్లో రోష్ని నాడార్ అగ్రస్థానంలో 

భవిష్యత్తు నాయకత్వాన్ని సూచించే మహిళల్లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ఛైర్‌పర్సన్‌ రోష్ని నాడార్‌కు అగ్రస్థానం దక్కింది. ఆమె నాయకత్వంలోని హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ 60 దేశాల్లో కార్యకలాపాలను విస్తరించింది. కంపెనీ ఆదాయం రూ.1.11 లక్షల కోట్లు. 2024 మార్చిలో సంస్థ వ్యవస్థాపకుడు శివ్‌ నాడార్‌ తన 47 శాతం షేర్లను వారసత్వంగా ఆమెకు బదిలీ చేశారు. దీంతో ఆమె మెజారిటీ వాటాదారుగా మారారు. ప్రస్తుతం దేశంలో మూడో అత్యంత ధనిక మహిళగా ఉన్నారు.

వివరాలు 

ముంబయి నుంచే అధికులు 

ఈ జాబితాలోని 97 మందిలో 38 మంది ముంబయి నివాసులు. ఢిల్లీకి చెందిన వారు 12 మంది కాగా, బెంగళూరును ప్రాతినిధ్యం వహిస్తున్నవారు 10 మంది. దీంతో ఈ నగరాలు వరుసగా మొదటి, రెండవ, మూడవ స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఉన్న మహిళల సగటు వయసు 51 సంవత్సరాలు. వారిలో 26-35 ఏళ్ల మధ్య వయసు గలవారు 25 శాతం. ఆర్థిక సేవల రంగం నుంచి 23 మంది, వినియోగ వస్తు రంగం నుంచి 18 మంది, ఆరోగ్య సంరక్షణ రంగం నుంచి 14 మందికి చోటు లభించింది. రూ.154 కోట్లు దాతృత్వ కార్యక్రమాలకు ఖర్చు చేసిన రోహిణి నీలేకని, దాతృత్వ విభాగంలో అగ్రస్థానాన్ని పొందారు.

వివరాలు 

ముంబయి నుంచే అధికులు 

ఈ జాబితాలో అత్యంత పిన్న వయస్కురాలిగా 28 ఏళ్ల స్కిల్‌మ్యాటిక్‌ సహ వ్యవస్థాపకురాలు దేవాన్షి కేజ్రీవాల్‌ నిలిచారు. మరోవైపు, 87 ఏళ్ల కళాకారిణి అర్పితా సింగ్‌ పెద్దవయస్కురాలిగా గుర్తింపు పొందారు. ఈ జాబితాలో పేర్కొన్న మహిళలు నాయకత్వం వహిస్తున్న వ్యాపార సంస్థల కలిపిన విలువ రూ.11.7 లక్షల కోట్లు అని నివేదికలో వెల్లడించారు.