Page Loader
IBM Layoffs: ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!
ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!

IBM Layoffs: ఐబీఎమ్‌లో భారీగా ఉద్యోగాల కోత.. 8 వేల మందిపై వేటు..!

వ్రాసిన వారు Sirish Praharaju
May 27, 2025
12:48 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల తొలగింపులు కొనసాగుతున్నాయి. గ్లోబల్‌ మార్కెట్లలో ఆర్థిక అస్థిరత, వాణిజ్య సుంకాల యుద్ధం (టారిఫ్ వార్), లాభాల్లో తగ్గుదల, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం పెరుగుదల వంటి పలు అంశాల వల్ల కంపెనీలు తమ ఖర్చులను తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ చర్యలలో భాగంగా, సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించడం ప్రారంభించాయి. 2025లో ఇప్పటివరకు సుమారు 100 కంపెనీలు కలిపి 27,000 మందికి పైగా ఉద్యోగులను పని నుంచి తొలగించాయి.

వివరాలు 

ఉద్యోగులలో ఎక్కువశాతం మానవ వనరుల విభాగమే 

ఇటీవల ఈ జాబితాలో టెక్‌ దిగ్గజం ఐబీఎమ్‌ (IBM) కూడా చేరింది. సంస్థ దాదాపు 8,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. తొలగింపులకు గురయ్యే ఉద్యోగులలో ఎక్కువశాతం మంది మానవ వనరుల విభాగానికి (HR డిపార్ట్‌మెంట్‌) చెందిన వారేనని తెలుస్తోంది. ఇటీవలే ఆటోమేషన్‌పై దృష్టి పెడుతూ, ఐబీఎమ్‌ సంస్థ తన హెచ్‌ఆర్‌ విభాగంలోని కొంతమందిని ఏఐ వ్యవస్థలతో భర్తీ చేసిన సంగతి ఇప్పటికే బయటపడింది. దాదాపు 200 ఉద్యోగాల స్థానాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో భర్తీ చేశారని సమాచారం.

వివరాలు 

హెచ్‌ఆర్‌ విభాగంలోని ఏఐ వ్యవస్థలే సహకరిస్తున్నాయి: అరవింద్ కృష్ణ

ఐబీఎమ్‌ సీఈవో అరవింద్ కృష్ణ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సంస్థ అధికంగా ఏఐ ఆధారిత టూల్స్‌పై దృష్టి సారించిందని తెలిపారు. సంస్థలో కొన్ని పనులను ఆటోమేట్‌ చేయడం ద్వారా, మిగిలిన విభాగాల్లో పెట్టుబడులకు అవసరమైన వనరులు సమకూరుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కొన్ని ఎంటర్‌ప్రైజ్ వర్క్‌ఫ్లోలలో ఏఐ, ఆటోమేషన్ వినియోగం సంస్థ కార్యకలాపాల్లో స్పష్టమైన మార్పులు తీసుకువచ్చిందని వివరించారు. మొత్తంగా ఉద్యోగుల సంఖ్య పెరిగిందని, ఇతర విభాగాల్లో నియామకాలకు హెచ్‌ఆర్‌ విభాగంలోని ఏఐ వ్యవస్థలే సహకరిస్తున్నాయని తెలిపారు.

వివరాలు 

 2025లో 27,762 మంది తొలగింపు 

ఇటీవలి సంవత్సరాల్లో చిన్న, పెద్ద తేడా లేకుండా అనేక కంపెనీలు వివిధ కారణాలను చూపిస్తూ ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగిస్తున్నాయి. లేఆఫ్స్‌.ఎఫ్‌వై (Layoffs.fyi) వెబ్‌సైట్‌ తెలిపిన వివరాల ప్రకారం, 2025లో ఇప్పటివరకు సాంకేతిక రంగానికి చెందిన 100 కంపెనీలు కలిపి 27,762 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. 2024లో 549 టెక్ కంపెనీలు 1,52,472 మంది ఉద్యోగులను తొలగించగా, 2023లో 1,193 కంపెనీలు మొత్తం 2,64,220 మంది ఉద్యోగులను పనిచేయకుండా చేశాయి.