ICICI Prudential: ఐసీఐసీఐ AMC ఐపీఓ లిస్టింగ్.. 20 శాతం ప్రీమియంతో ఎంట్రీ
ఈ వార్తాకథనం ఏంటి
ఐసీఐసీఐ బ్యాంక్‌కు అనుబంధ సంస్థ అయిన ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ICICI Prudential AMC) షేర్లు శుక్రవారం స్టాక్ మార్కెట్‌లో అధికారికంగా లిస్టయ్యాయి. దలాల్ స్ట్రీట్‌లోకి అడుగుపెట్టిన తొలి రోజే ఈ షేర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుని బలమైన ప్రదర్శన చేశాయి. ఐపీఓ ధరతో పోలిస్తే సుమారు 20 శాతం ప్రీమియంతో లిస్ట్ కావడం విశేషం. ఐపీఓలో భాగంగా ఒక్కో షేరు ధరను కంపెనీ రూ.2,061 నుంచి రూ.2,165 మధ్య నిర్ణయించింది. ఇష్యూ ధర అయిన రూ.2,165తో పోలిస్తే, ఎన్‌ఎస్‌ఈలో రూ.2,600 వద్ద లిస్టవగా, బీఎస్‌ఈలో రూ.2,606 వద్ద నమోదయ్యాయి.
వివరాలు
రూ.1.07 లక్షల కోట్ల మార్కెట్ విలువ
మొత్తం రూ.10,602.65 కోట్ల విలువైన ఈ ఐపీఓలో భాగంగా 3,50,15,691 షేర్లను (సుమారు 3.50 కోట్ల షేర్లు) విక్రయానికి ఉంచారు. వీటికి భారీ స్పందన లభించగా, మొత్తం 1,37,14,88,316 షేర్లకు (సుమారు 137 కోట్ల షేర్లు) బిడ్లు నమోదయ్యాయి. కేటగిరీల వారీగా చూస్తే.. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాకు 123.87 రెట్లు, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటాకు 22.04 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల కోటాకు 2.53 రెట్లు సబ్‌స్క్రిప్షన్ లభించింది. సుమారు రూ.1.07 లక్షల కోట్ల మార్కెట్ విలువతో ఈ సంస్థ ఐపీఓ మార్కెట్‌లోకి ప్రవేశించింది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) రూపంలోనే జరిగింది.
వివరాలు
ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి నేరుగా ఎలాంటి కొత్త నిధులు సమకూరలేదు
ఇందులో భాగంగా ప్రమోటర్ సంస్థ అయిన యూకేకు చెందిన ప్రుడెన్షియల్ కార్పొరేషన్ మొత్తం 4.89 కోట్ల షేర్లను విక్రయించింది. దీంతో ఈ ఐపీఓ ద్వారా కంపెనీకి నేరుగా ఎలాంటి కొత్త నిధులు సమకూరలేదు. ప్రస్తుతం ఈ ఏఎంసీ కంపెనీలో ఐసీఐసీఐ బ్యాంక్‌కు 51 శాతం,ప్రుడెన్షియల్ సంస్థకు 49 శాతం వాటా ఉంది. ఇప్పటికే హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, యూటీఐ ఏఎంసీ, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, శ్రీరామ్ ఏఎంసీ, నిప్పాన్ లైఫ్ ఇండియా అసెట్ మేనేజ్‌మెంట్ వంటి సంస్థలు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్టై ఉండటంతో, ఈ రంగంలో పోటీ మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.