ICICI-Videocon scam case: కొచ్చర్ దంపతులు, ధూత్‌లపై చార్జిషీట్ దాఖలు చేసిన సీబీఐ
ఐసీఐసీఐ-వీడియోకాన్ రుణాల మోసం కేసుకు సంబంధించి ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ ఎండీ, ఛైర్మన్ చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్, వీడియోకాన్ గ్రూప్ ఛైర్మన్ వేణుగోపాల్ ధూత్‌లపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) చార్జ్ షీట్ దాఖలు చేసింది. వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, వేణుగోపాల్ నంద్‌లాల్ ధూత్, చందా కొచ్చర్, దీపక్ వీరేంద్ర కొచ్చర్, నూపవర్ రెన్యూవబుల్స్ లిమిటెడ్, సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఐపీసీ సెక్షన్లు 120 బీ, 420, సెక్షన్ 7-సెక్షన్ 13(2), 13(1)(డీ) కింద 2019లో కేసులు నమోదు చేశారు.
చందా కొచ్చర్ అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు
ఆగస్ట్ 26, 2009న, చందా కొచ్చర్ నేతృత్వంలోని శాంక్షనింగ్ కమిటీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ఎండీకి రూ.3250 కోట్ల రూపాయల టర్మ్ లోన్‌ను మంజూరు చేసింది. ఈ లోను మంజూరులో చందా కొచ్చర్ అధికారిక పదవిని దుర్వినియోగం పాల్పడినట్లు సీబీఐ అభియోగాలు మోపింది. సెప్టెంబర్ 7, 2009న చందా కొచ్చర్ రుణం మంజూరు చేశారు. ఆ తర్వాతి తేదీ సెప్టెంబర్ 8, 2009న ధూత్ తన కంపెనీ సుప్రీం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా వీడియోకాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ నుంచి దీపక్ కొచ్చర్ నిర్వహించే ఎన్ఆర్ఎల్‌కు రూ.64 కోట్లను బదిలీ అయినట్లు సీబీఐ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది.