IDFC First Bank: IDFC ఫస్ట్ బ్యాంక్ షేర్లకు భారీ షాక్.. 20% వరకు కుప్పకూలిన ధరలు
ఈ వార్తాకథనం ఏంటి
IDFC First Bank షేర్లు సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన క్షణం నుంచే తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఒక దశలో ఇవి సుమారు 20 శాతం వరకు క్షీణించాయి. తరువాత స్వల్పంగా కోలుకున్నప్పటికీ, మొత్తం మీద మాత్రం గణనీయమైన నష్టాలతోనే కొనసాగుతున్నాయి. చండీగఢ్‌లో ఉన్న తమ బ్రాంచ్‌లో సుమారు రూ.590కోట్ల మేర ఆర్థిక అక్రమాలు జరిగి ఉండొచ్చనే అనుమానం ఉన్నట్లు బ్యాంక్ యాజమాన్యం వెల్లడించింది. ప్రభుత్వ ఖాతాల నిర్వహణ ప్రక్రియలోనే ఈ అవకతవకలు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు. ఈ సమాచారం వెలుగులోకి రావడంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన మరింత పెరిగింది. దాంతో ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే షేర్లు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఉదయం 11.08 గంటల సమయానికి ఇవి 15.28 శాతం పడిపోయి రూ.70.75 వద్ద ట్రేడవుతున్నాయి.
వివరాలు
విభాగం లెక్కల పుస్తకాలలో చూపిన నగదు నిల్వలు, బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తంతో సరిపోలకపోవడంతో అనుమానాలు
హరియాణా రాష్ట్ర ప్రభుత్వంలోని ఒక విభాగం తమ ఖాతాను మూసివేసి నిధులను ఇతరత్రా బదిలీ చేయాలని కోరడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఆ విభాగం లెక్కల పుస్తకాలలో చూపిన నగదు నిల్వలు, బ్యాంక్ ఖాతాలో ఉన్న మొత్తంతో సరిపోలకపోవడంతో అనుమానాలు తలెత్తాయి. దీనితో హరియాణా ప్రభుత్వానికి చెందిన మరికొన్ని శాఖలు కూడా తమ ఖాతాలను పరిశీలించడం ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సమస్య చండీగఢ్ శాఖ పరిధిలోని ఖాతాలకు మాత్రమే పరిమితమైనట్లు తెలుస్తోంది.