
UPI Payments: యూపీఐ లావాదేవీల్లో ప్రపంచంలోనే భారత్ టాప్: ఐఎంఎఫ్
ఈ వార్తాకథనం ఏంటి
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) లావాదేవీల పరంగా ప్రపంచంలో భారత్‌నే టాప్ దేశంగా ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిధి) గుర్తించింది. 'గ్రోయింగ్ రిటైల్ డిజిటల్ చెల్లింపులు: ది వాల్యూ ఆఫ్ ఇంటర్‌ఆపరబిలిటీ' పేరుతో ఇటీవల విడుదల చేసిన నివేదికలో, యూపీఐ వృద్ధి రేటు దృష్ట్యా రియల్ టైమ్ డిజిటల్ చెల్లింపుల్లో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు పేర్కొంది. ప్రస్తుతం భారత్‌లో నెలకు 1,800 కోట్లకు పైగా యూపీఐ లావాదేవీలు జరుగుతున్నట్లు ఐఎంఎఫ్ వెల్లడించింది. 2016లో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) యూపీఐని ప్రారంభించింది. ఇది వినియోగదారులకు వారి బహుళ బ్యాంక్ ఖాతాలను ఒకే మొబైల్ యాప్‌కు లింక్ చేయడంతో పాటు తక్షణ లావాదేవీలు సులభంగా నిర్వహించే వీలును కల్పిస్తోంది.
వివరాలు
దేశ చెల్లింపుల వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ
దీనివల్ల దేశ చెల్లింపుల వ్యవస్థలో ఓ విప్లవాత్మక మార్పును తీసుకొచ్చింది. వ్యక్తి నుంచి వ్యక్తికి (పియర్-టు-పియర్) డిజిటల్ చెల్లింపులను సులభతరం చేయడమే కాకుండా లక్షలాది చిన్న వ్యాపారులకు తక్కువ ఖర్చుతో డిజిటల్ లావాదేవీలు నిర్వహించుకునే అవకాశాన్నియూపీఐ కల్పిస్తోంది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB)విడుదల చేసిన సమాచారం ప్రకారం,ప్రస్తుతం నెలకు 18 బిలియన్లకు పైగా లావాదేవీలు యూపీఐ ద్వారా జరుగుతున్నాయి. దేశంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో యూపీఐ వాటా 85 శాతంగా ఉన్నదీ కీలకమైన అంశం. కేవలం ఈ ఏడాది జూన్ నెలలోనే యూపీఐ ద్వారా 18.39 బిలియన్ లావాదేవీలు జరిగాయి. వీటి విలువ రూ.24.03 లక్షల కోట్లు. గత ఏడాది జూన్‌తో పోలిస్తే ఈ సంఖ్య 32 శాతం వృద్ధి చెందిందని పేర్కొన్నారు.
వివరాలు
యూపీఐ సేవలను వినియోగిస్తున్న 6.5 కోట్ల మంది వ్యాపారులు,49.1 కోట్ల మంది సాధారణ ప్రజలు
దేశవ్యాప్తంగా 49.1 కోట్ల మంది సాధారణ ప్రజలు, 6.5 కోట్ల మంది వ్యాపారులు యూపీఐ సేవలను వినియోగిస్తున్నారని వెల్లడించారు. 675 బ్యాంకులను యూపీఐ ఒకే డిజిటల్ ఫ్రేమ్‌వర్క్‌లో కలుపుతూ పనిచేస్తోంది. "భారతదేశంలో ప్రస్తుతం డిజిటల్ చెల్లింపులు నగదు, కార్డు ఆధారిత లావాదేవీల కంటే అధికంగా జరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ వైపు దారిమళ్ళించడంలో యూపీఐ కీలకపాత్ర పోషిస్తోంది. లక్షలాది ప్రజలు, చిన్న వ్యాపారులు సురక్షితమైన డిజిటల్ లావాదేవీల కోసం యూపీఐను విశ్వసిస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి యూపీఐ ఓ శక్తివంతమైన సాధనంగా మారింది" అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.