Spirit Airlines: ఫ్యూయల్ సంక్షోభం ప్రభావం.. స్పిరిట్ ఎయిర్‌లైన్స్ సేవలు నిలిపివేత
ఈ వార్తాకథనం ఏంటి
ఇంధన కొరత, పెరుగుతున్న జెట్ ఫ్యూయల్ ధరల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. కొన్ని సంస్థలు సర్వీసులను తగ్గించుకుంటుండగా, మరికొన్ని టికెట్ ధరలను పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పిరిట్ ఎయిర్‌లైన్స్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ విమాన సర్వీసులను శాశ్వతంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ఇప్పటికే అన్ని ఫ్లైట్లను రద్దు చేసినట్లు తెలిపిన సంస్థ,టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బు తిరిగి చెల్లిస్తామని పేర్కొంది. ఇతర ఎయిర్‌లైన్స్‌లో ప్రయాణ బుకింగ్‌లకు ఎలాంటి సహాయం చేయమని స్పష్టం చేసింది. దాదాపు 34 ఏళ్లుగా తక్కువ ధరలతో సేవలు అందిస్తున్న స్పిరిట్ ఎయిర్‌లైన్స్ రోజూ వందలాది విమానాలను నడుపుతూ సుమారు 17,000మందికి ఉపాధి కల్పిస్తోంది.
వివరాలు
ఈ సంస్థకు సుమారు 8.1 బిలియన్ డాలర్ల అప్పులు
అయితే కోవిడ్ అనంతరం పెరిగిన నిర్వహణ వ్యయాలు, అప్పుల భారంతో ఈ సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంది. అంతేకాకుండా ఇరాన్ సంబంధిత ఉద్రిక్తతల కారణంగా జెట్ ఇంధన ధరలు పెరగడం కూడా పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఆగస్టు 2025 నాటికి ఈ సంస్థకు సుమారు 8.1 బిలియన్ డాలర్ల అప్పులు, 8.6 బిలియన్ డాలర్ల ఆస్తులు ఉన్నట్లు సమాచారం. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు యూఎస్ ప్రభుత్వ సాయం కోరినప్పటికీ ఎటువంటి ఆర్థిక మద్దతు లభించకపోవడంతో చివరకు సర్వీసులను నిలిపివేయాల్సి వచ్చింది. సంస్థ మూసివేతతో సుమారు 17 వేల మంది ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనున్నట్లు స్పిరిట్ ఎయిర్‌లైన్స్ న్యాయవాది మార్షల్ హ్యూబ్నర్ తెలిపారు.