Defence Budget: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ చుట్టూ భద్రతా సవాళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్‌ను పెంచింది. ఒకవైపు పాకిస్థాన్, మరోవైపు చైనా, బంగ్లాదేశ్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా.. ఇటీవల నిర్వహించిన 'ఆపరేషన్ సిందూర్' ద్వారా అత్యాధునిక యుద్ధతంత్రాల అవసరాన్ని భారత్ స్పష్టంగా గుర్తించింది. ఈ నేపథ్యంలోనే తాజా బడ్జెట్‌లో రక్షణ రంగానికి భారీ కేటాయింపులు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రక్షణకు మొత్తం రూ.6.81 లక్షల కోట్లను కేటాయించగా.. ఈసారి ఆ మొత్తం రూ.7.85 లక్షల కోట్లకు పెరిగింది. మొత్తం కేంద్ర బడ్జెట్ కేటాయింపుల్లో రక్షణ రంగానికి 14.68 శాతం వాటా దక్కిందని రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
Details
వాయుసేన సామర్థ్యాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు
ప్రధానంగా రక్షణ దళాల ఆధునికీకరణకు పెద్దపీట వేస్తూ కేటాయింపులను 21.84 శాతం మేర పెంచారు. గతేడాది రూ.1.8 లక్షల కోట్లుగా ఉన్న ఈ విభాగానికి ఈసారి రూ.2.19 లక్షల కోట్లను కేటాయించడం గమనార్హం. ఆధునిక ఆయుధాలు, సాంకేతిక పరికరాలు, యుద్ధ సామర్థ్యాన్ని పెంచే ప్రాజెక్టులకు ఇది దోహదపడనుంది. వాయుసేన అవసరాలకు కూడా ఈ బడ్జెట్‌లో విశేష ప్రాధాన్యం ఇచ్చారు. యుద్ధ విమానాలు, విమాన ఇంజిన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల కొనుగోలు కోసం రూ.63,733 కోట్లు కేటాయించారు. ఇది వాయుసేన సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా భావిస్తున్నారు.
Details
ఈసారి అత్యధికంగా రూ.255 కోట్లు కేటాయింపు
రక్షణ దళాల రోజువారీ కార్యకలాపాలు, సిబ్బంది వేతనాలు, ఇంధనం, రేషన్, ఆయుధాల నిర్వహణ, మందుగుండు సామగ్రి వంటి అంశాలకు కేటాయింపులను 17.24 శాతం పెంచారు. దీని ద్వారా దళాల ఆపరేషన్ సామర్థ్యం మరింత బలపడనుంది. అలాగే, పింఛన్ల కోసం కేటాయింపును 6.53 శాతం పెంచి రూ.1.71లక్షల కోట్లకు చేర్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్న రాష్ట్రీయ రైఫిల్స్ దళానికి కూడా నిధులు పెరిగాయి. మూడేళ్లతో పోలిస్తే ఈసారి అత్యధికంగా రూ.255 కోట్లు కేటాయించారు. గతేడాది ఈ మొత్తము రూ.222కోట్లకే పరిమితమైంది. రక్షణ రంగంలో అత్యంత గోప్యంగా పరిగణించే స్పెషల్ ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం రూ.1,989.12కోట్లను కేటాయించింది. అయితే ఎయిర్ ఫోర్స్‌కు సంబంధించిన కొన్ని ప్రాజెక్టుల విషయంలో కేటాయింపులు స్వల్పంగా తగ్గి రూ.1,618 కోట్లకు పరిమితమయ్యాయి.
Details
రక్షణ మంత్రి స్పందన
తాజా బడ్జెట్‌పై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. ఆపరేషన్ సిందూర్‌లో చారిత్రక విజయం సాధించిన తర్వాత, భవిష్యత్తులో దేశ రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ బడ్జెట్‌ను రూపొందించారు. భద్రత, అభివృద్ధి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాల మధ్య సమతూకం పాటిస్తూ ఈ కేటాయింపులు చేశారని వ్యాఖ్యానించారు.