LOADING...
Oil prices: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ప్రభావం.. 10శాతం పెరిగిన చమురు ధరలు!
ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ప్రభావం.. 10శాతం పెరిగిన చమురు ధరలు!

Oil prices: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ దాడుల ప్రభావం.. 10శాతం పెరిగిన చమురు ధరలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 23, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్‌ ఇటీవల జరిపిన వైమానిక దాడుల ప్రభావంతో అంతర్జాతీయ చమురు మార్కెట్లు ఉలిక్కిపడ్డాయి. చమురు సరఫరాపై ఇప్పటివరకు పెద్దగా అంతరాయాలు రాకపోయినప్పటికీ, ఇరాన్‌ హోర్ముస్‌ జలసంధిని మూసివేసే అవకాశం ఉందన్న భయాలు ముడిచమురు ధరలను ఒక్కసారిగా 10 శాతం పెంచేశాయి.

Details

కీలక ప్రదేశం 'హోర్ముస్‌' జలసంధి 

పెర్షియన్‌ గల్ఫ్‌ నుంచి మిగతా ప్రపంచానికి చమురు రవాణా అయ్యే ఏకైక మార్గం 'హోర్ముస్‌' జలసంధి. అతి కొద్ది ప్రాంతంలో కేవలం 21 మైళ్లు వెడల్పే ఉన్న ఈ జలసంధిలో రోజుకు సుమారు 2 కోట్ల బ్యారెళ్ళ చమురు రవాణా అవుతుంది. అది మొత్తం ప్రపంచ ఉత్పత్తిలో ఐదో వంతు అని అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ (EIA) పేర్కొంది. ఆదివారం అమెరికా ఇరాన్‌ న్యూక్లియర్‌ సదుపాయాలపై దాడి చేసిన వెంటనే బ్రెంట్‌ క్రూడ్‌ ధర 80 డాలర్లకు ఎగసింది. ఇది2024 జనవరి తర్వాత తొలి సారి. గత ఆగస్టు నుంచి ధరలు60-75 డాలర్ల మధ్యే ఉంటూ వచ్చాయి. ప్రస్తుతం బ్రెంట్‌ క్రూడ్‌ 78.2 డాలర్లు, డబ్ల్యూటీఐ75.06 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ అవుతున్నాయి.

Details

తదుపరి ప్రభావం ఇరాన్‌ నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుంది 

ఇరాన్‌ హోర్ముస్‌ జలసంధిని మూసేస్తే చమురు ధరలు 100 డాలర్ల వరకు చేరే అవకాశం ఉన్నదని టార్టాయిస్‌ క్యాపిటల్‌ సంస్థ పోర్ట్‌ఫోలియో మేనేజర్‌ రాబ్‌ థుమెల్‌ అన్నారు. హోర్ముస్‌ జలసంధి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్‌ హెచ్చరికలు, విశ్లేషకుల అంచనాలు ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీకి సన్నిహితుడైన హోసేన్‌ షరియత్మదారి ఇప్పుడు మాది ప్రతీకారపు సమయమని హెచ్చరించారు. ఇరాన్‌ విశ్లేషకుడు మొహమ్మద్‌ అలీ షబానీ మాట్లాడుతూ, "హోర్ముస్‌ ద్వారా రవాణా నిలిపితే చమురు ధరలు పెరిగి, అమెరికా ఆర్థిక ప్రణాళికలకు ముప్పు ఏర్పడుతుంది" అని చెప్పారు.

Details

హోర్ముస్‌ మూసివేస్తే భారత్‌, చైనా ప్రభావం 

హోర్ముస్‌ జలసంధిని ఇరాన్‌ మూసే అవకాశాన్ని 'తక్కువ'గా ఎనర్జీ నిపుణురాలు వందనా హరి అభిప్రాయపడ్డారు. "ఇరాన్‌ సరఫరా అంతరాయం సృష్టిస్తే, అది మిత్రదేశాలకే నష్టకరం. ముఖ్యంగా చైనా, భారత్‌, కొరియా వంటి దేశాలపై ప్రభావం ఉంటుందని అన్నారు. EIA గణాంకాల ప్రకారం, హోర్ముస్‌ గుండా వచ్చే చమురు, గ్యాస్‌ల్లో 84 శాతం ముడిచమురు, 83 శాతం లిక్విఫైడ్‌ న్యాచురల్‌ గ్యాస్‌ ఆసియా మార్కెట్లకే చేరతాయి. చైనా మొదటి త్రైమాసికంలో 5.4 మిలియన్‌ బ్యారెళ్లు, భారత్‌, కొరియా వరుసగా 2.1 మిలియన్‌, 1.7 మిలియన్‌ బ్యారెళ్లు రవాణా చేసుకున్నాయి.

Details

అనేక వారాల పాటు సరఫరా

అదే సమయంలో అమెరికా, యూరప్‌ రవాణా కేవలం 4 లక్షల, 5 లక్షల బ్యారెళ్లు మాత్రమే. తాజా పరిణామాల నేపథ్యంలో భారత్‌ పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి మాట్లాడుతూ, "మా చమురు సరఫరాలో పెద్ద భాగం హోర్ముస్‌ గుండా రాకపోవచ్చు. ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థలకు అనేక వారాల సరఫరా సిద్ధం ఉంది. రవాణా స్థిరతకై అన్ని చర్యలు తీసుకుంటామని ట్విటర్‌ (ఎక్స్‌) లో తెలిపారు.