Stock Market Today: అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ఎఫెక్ట్.. లాభాల బాటలో దేశీయ సూచీలు
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందన్న ప్రకటనతో పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడిన నేపథ్యంలో అంతర్జాతీయ చమురు ధరలు గణనీయంగా తగ్గాయి. దీంతో మదుపర్ల సెంటిమెంట్ మెరుగుపడి సూచీలు బలంగా పుంజుకున్నాయి. ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సెన్సెక్స్ 1,200 పాయింట్ల వరకు ఎగబాకింది. ఉదయం 9.28 గంటల సమయానికి సెన్సెక్స్ 1,069 పాయింట్లు లాభపడి 76,597 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 327 పాయింట్లు పెరిగి 23,950 స్థాయికి చేరుకుంది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి కూడా బలపడింది. ట్రేడింగ్ ప్రారంభంలో రూపాయి విలువ 94.68 వద్ద నమోదైంది.
వివరాలు
లాభాల్లో బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు
మే 8 తర్వాత రూపాయి ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. నిఫ్టీ సూచీలో శ్రీరామ్ ఫైనాన్స్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, టీఎంపీవీ, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఓఎన్‌జీసీ, సిప్లా, భారతీ ఎయిర్‌టెల్, అపోలో హాస్పిటల్స్, సన్ ఫార్మా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
మార్కెట్ల ర్యాలీకి కారణాలివే
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం ప్రకటనతో అంతర్జాతీయ చమురు మార్కెట్లో ఒత్తిడి తగ్గింది. 107 రోజులుగా కొనసాగిన ఘర్షణలకు ముగింపు దిశగా పరిణామాలు సాగడంతో క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియెట్ (WTI) క్రూడ్ ధర బ్యారెల్‌కు 4 శాతానికి పైగా పడిపోయి 80.91 డాలర్లకు చేరుకుంది. అలాగే బ్రెంట్ క్రూడ్ ధర 3.95 శాతం క్షీణించి బ్యారెల్‌కు 83.88 డాలర్ల వద్దకు దిగివచ్చింది. చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటం వంటి అనుకూల పరిణామాల నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా లాభాల్లో పయనిస్తున్నాయి. ఇదే సమయంలో మదుపర్లు కొనుగోళ్లపై ఆసక్తి చూపడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లలో బలమైన ర్యాలీ కనిపిస్తోంది.