Starlink: భారత్‌లో స్టార్‌లింక్ అనుమతులు ఫ్రీజ్ అయ్యాయా? మస్క్ సంస్థ క్లారిటీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలుకథనాలు వెలువడ్డాయి. స్టార్‌లింక్ సేవల ప్రారంభానికి అవసరమైన తుది అనుమతుల ప్రక్రియను భారత ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసిందని వార్తలు వచ్చాయి. అయితే ఈ ప్రచారంపై స్టార్‌లింక్ తాజాగా స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చింది. స్టార్‌లింక్ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ ఎక్స్ వేదికగా మాట్లాడుతూ..భారత ప్రభుత్వంతో చురుకైన చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు. నిరాధారమైన వార్తలకు విరుద్ధంగా ప్రభుత్వంతో సానుకూల చర్చలు జరుగుతున్నాయని,మంచి స్పందన లభించిందని వెల్లడించారు. భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు అవసరమైన అన్ని నియంత్రణ,భద్రతా,అనుమతి ప్రక్రియల్లో సంస్థ పూర్తిస్థాయి పారదర్శకతతో వ్యవహరించిందని,ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా సహకరిస్తోందని స్పష్టం చేశారు.
వివరాలు
భద్రతా చర్యలపై అదనపు వివరాలు
ఇదిలా ఉండగా, స్టార్‌లింక్ తుది క్లియరెన్స్‌పై ఆలస్యం జరగడానికి పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్‌లో అధికారిక అనుమతులు లేకుండానే యుద్ధ పరిస్థితుల్లో స్టార్‌లింక్ టెర్మినల్స్ వినియోగించారనే వార్తలు వెలువడటం భారత అధికారుల్లో ఆందోళనకు దారితీసినట్లు సమాచారం. ఒకవేళ భవిష్యత్తులో విదేశీ ప్రభుత్వాల నుంచి ఒత్తిళ్లు వచ్చినా.. భారత జాతీయ భద్రతా ప్రయోజనాలకు అనుగుణంగా స్టార్‌లింక్ వ్యవహరిస్తుందా అనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో స్టార్‌లింక్ గతంలోనే టెలికాం అధికారులకు తమ భద్రతా వ్యవస్థలు, విధివిధానాలపై వివరణ ఇచ్చింది. అయితే అధికారులు మరింత స్పష్టత కోరుతూ సంస్థ చేపడుతున్న భద్రతా చర్యలపై అదనపు వివరాలు అడిగినట్లు సమాచారం.
వివరాలు
తక్కువ లేటెన్సీతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు
ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్-X అనుబంధ సంస్థ స్టార్‌లింక్ ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాల్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. సంప్రదాయ ఉపగ్రహ సేవలు భూస్థిర కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలపై ఆధారపడితే, స్టార్‌లింక్ మాత్రం లో ఎర్త్ ఆర్బిట్ (LEO) సాంకేతికతను వినియోగిస్తోంది. భూమికి సుమారు 550 కిలోమీటర్ల ఎత్తులో పరిభ్రమించే దాదాపు 6,000 ఉపగ్రహాల నెట్‌వర్క్ ద్వారా స్టార్‌లింక్ సేవలు అందిస్తోంది. ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉండటం వల్ల తక్కువ లేటెన్సీతో వేగవంతమైన ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వస్తాయి. ముఖ్యంగా మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాలు, సాధారణ బ్రాడ్‌బ్యాండ్ సౌకర్యాలు అందని ప్రాంతాల్లో అధిక వేగంతో ఇంటర్నెట్ సేవలను అందించడంలో స్టార్‌లింక్ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది.