Cisco layoffs: సిస్కో కంపెనీలో లేఆఫ్స్.. వేలాది మందిపై వేటు
ఆర్థిక మాంద్య భయాలు, ప్రపంచ భౌగోళిక ఉద్రిక్త పరిస్థితులు, దేశాల మధ్య యుద్ధాల ప్రభావం కారణంగా మరోసారి పారిశ్రామిక రంగంపై తీవ్రంగా ప్రభావం చూపుతోంది. ఇప్పటికే చాలా కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టాయి. మొన్న డెల్ సంస్థ 12500 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ప్రముఖ కంపెనీ ఈ జాబితాలో చేరింది. ప్రముఖ నెట్వర్కింగ్ ఈక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరింగ్ సంస్థల్లో ఒకటైన సిస్కో(Cisco) మరోసారి ఉద్యోగాల తొలగించనున్నట్లు తెలిసింది. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి అధిక వృద్ధి ఉన్న ఏరియాలపై దృష్టి సారిస్తున్న క్రమంలోనే ఉద్యోగాలను తొలగిస్తున్నట్లు రాయిటర్స్ స్పష్టం చేసింది.
ఆరు నెలలు గడవకముందే మళ్లీ లేఆఫ్స్
ఈ ఏడాది 2024, ఫిబ్రవరి నెలలో 4వేల మందిని సిస్కో తొలగించిన విషయం తెలిసిందే. ఆరు నెలలు గడవకముందే మళ్లీ ఈ కంపెనీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇప్పుడు కూడా అదే స్థాయిలో ఉద్యోగులను ఇళ్లకు పంపించే అవకాశం ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. వ్యాపారంలో డిమాండ్ తగ్గడం, సరఫరా చైన్‌లో సమస్యల కారణంగానే కంపెనీ ఇలాంటి నిర్ణయాలను తీసుకుంటోంది.