LOADING...
Piped Gas: పైప్డ్‌ వంట గ్యాస్‌కు మారితే ప్రోత్సాహకాలు: కేంద్రం
పైప్డ్‌ వంట గ్యాస్‌కు మారితే ప్రోత్సాహకాలు: కేంద్రం

Piped Gas: పైప్డ్‌ వంట గ్యాస్‌కు మారితే ప్రోత్సాహకాలు: కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 17, 2026
10:13 am

ఈ వార్తాకథనం ఏంటి

ఒక్కసారిగా పెరిగిన డిమాండ్‌ కారణంగా వంటగ్యాస్‌ (ఎల్‌పీజీ) సిలిండర్లపై ఒత్తిడి ఏర్పడిన నేపథ్యంలో, వినియోగదార్లను పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ) వైపు మళ్లించేందుకు సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలు ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రవేశపెడుతున్నాయి. ఎల్‌పీజీ సరఫరా వ్యవస్థపై భారం తగ్గించాలన్నకేంద్ర ప్రభుత్వ లక్ష్యంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు పెట్రోలియం శాఖ ఉన్నతాధికారి వివరించారు. గృహ అవసరాల కోసం పీఎన్‌జీ కనెక్షన్‌ తీసుకుని మార్చి 31లోపు వినియోగాన్ని ప్రారంభించే వినియోగదారులకు రూ.500 విలువైన గ్యాస్‌ను ఉచితంగా అందిస్తామని ఇంద్రప్రస్థ గ్యాస్‌ వెల్లడించింది. ఈ సంస్థ దిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో పీఎన్‌జీ సేవలు అందిస్తోంది. మరోవైపు,ముంబయికి చెందిన మహానగర్‌ గ్యాస్‌ లిమిటెడ్‌ గృహ వినియోగదారుల నుంచి వసూలు చేసే రూ.500రిజిస్ట్రేషన్‌ ఫీజును రద్దు చేసింది.

వివరాలు 

గెయిల్, బీపీసీఎల్‌ కూడా..

అలాగే వాణిజ్య వినియోగదారులకు విధించే రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షల వరకు ఉండే సెక్యూరిటీ డిపాజిట్‌పై కూడా మినహాయింపులు కల్పించింది. గెయిల్‌, బీపీసీఎల్‌ సంస్థలు కూడా ఇదే విధమైన ప్రోత్సాహక చర్యలను అమలు చేస్తున్నాయని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. పీఎన్‌జీకి మారాలని భావిస్తున్న వారు ఇ-మెయిల్‌, అధికారిక వెబ్‌సైట్లు, లేఖలు లేదా కాల్‌ సెంటర్‌ల ద్వారా సిటీ గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ సంస్థలను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ఏ ప్రాంతంలో ఇప్పటికే గ్యాస్‌ పైప్‌లైన్‌ సదుపాయం ఉంటే, తక్కువ సమయంలోనే కనెక్షన్‌ అందజేస్తామని తెలిపారు.

వివరాలు 

సిలిండర్లకు కొరత లేదు

ప్రస్తుతం పరిస్థితుల్లో కొంత అనిశ్చితి ఉన్నప్పటికీ, గృహ వినియోగదారులకు ఎల్‌పీజీ సిలిండర్ల సరఫరా నిరంతరంగా కొనసాగుతోందని ఆమె స్పష్టం చేశారు. డీలర్ల వద్ద సిలిండర్ల కొరత ఉన్నట్లు ఎలాంటి సమాచారం తమకు అందలేదని పేర్కొన్నారు. సీఎన్‌జీ, పీఎన్‌జీ వినియోగదారులకు సహజ వాయువు సరఫరా పూర్తిస్థాయిలో కొనసాగుతోందని, వాహనాల కోసం సీఎన్‌జీ లభ్యతలో ఎలాంటి అంతరాయం ఉండదని భరోసా ఇచ్చారు. సిలిండర్‌ కోసం ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకోండి ఎల్‌పీజీ సిలిండర్ల బుకింగ్‌ కోసం వినియోగదారులు ఆన్‌లైన్‌ పద్ధతినే వినియోగించుకోవాలని ఆమె సూచించారు. డెలివరీ ధృవీకరణ కోడ్‌ల వినియోగాన్ని 53 శాతం నుంచి 72 శాతానికి పెంచినట్లు తెలిపారు.

Advertisement

వివరాలు 

వాణిజ్య సిలిండర్ల సరఫరా పునరుద్ధరణ

వాణిజ్య అవసరాల కోసం ఎల్‌పీజీ సిలిండర్ల పంపిణీని పలు రాష్ట్రాల్లో మళ్లీ ప్రారంభించినట్లు చెప్పారు. కేటాయింపుల ఆదేశాలు కూడా జారీ చేశామని, అయితే వాణిజ్య సిలిండర్ల సరఫరాలో ప్రాధాన్యత క్రమాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్ణయించాల్సి ఉంటుందని వివరించారు. బ్లాక్‌ మార్కెట్‌ నిరోధించాలి సిలిండర్ల అక్రమ విక్రయాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటికే సూచనలు జారీ చేసినట్లు సుజాత శర్మ తెలిపారు. పలు రాష్ట్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ పెంచారని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌, హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, అస్సోమ్‌, మిజోరామ్‌ సహా అనేక ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించినట్లు వెల్లడించారు.

Advertisement