Income Tax Alert: రూ.50,000 దాటితేనే TDS.. వడ్డీపై ఆదాయపు పన్ను శాఖ స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. ముఖ్యంగా బ్యాంకులు,డిపాజిటర్లలో ఉన్న సందేహాలను నివృత్తి చేసేలా తాజా స్పష్టత ఇచ్చింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 పరిధిలో పనిచేసే బ్యాంకింగ్ కంపెనీలు,నిర్దేశిత పరిమితిని మించిన వడ్డీ ఆదాయంపై తప్పనిసరిగా TDS కట్ చేయాలని శాఖ పేర్కొంది. ఈ సమాచారాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.ప్రస్తుత నిబంధనల ప్రకారం, ఒక ఆర్థిక సంవత్సరంలో బ్యాంకులు లేదా పోస్టాఫీస్ డిపాజిట్లపై లభించే వడ్డీ ఆదాయం సాధారణ పౌరులకు రూ.50,000 దాటితే, అలాగే సీనియర్ సిటిజన్లకు రూ.1 లక్ష మించితే మాత్రమే TDS వర్తిస్తుంది. ఈ పరిమితికి లోబడే వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.
వివరాలు
చిన్న మొత్తాల డిపాజిటర్లకు భారీ ఉపశమనం
కొత్తగా అమలులోకి వచ్చిన ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 2025లోని సెక్షన్ 402 ప్రకారం 'బ్యాంకింగ్ కంపెనీ' నిర్వచనాన్ని మరింత విస్తృతంగా వివరించారు. ఈ నిర్వచనంలో బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌కు లోబడే కంపెనీలతో పాటు, ఆ చట్టంలోని సెక్షన్ 51 కింద పేర్కొన్న బ్యాంకులు, ఇతర బ్యాంకింగ్ సంస్థలు కూడా చేరుతాయి. అంటే ఈ సంస్థలు ప్రత్యేకంగా పేర్కొనకపోయినా, TDS నిబంధనలు పాటించాల్సిందేనని శాఖ స్పష్టం చేసింది. అదేవిధంగా, సెక్షన్ 393(1)లో పేర్కొన్న పరిమితి కంటే తక్కువగా వడ్డీ ఆదాయం ఉంటే, బ్యాంకులు లేదా సంబంధిత సంస్థలు TDS కట్ చేయాల్సిన అవసరం లేదని కూడా తెలిపింది. దీని ద్వారా చిన్న మొత్తాల డిపాజిటర్లకు భారీ ఉపశమనం లభించనుంది.
వివరాలు
డిపాజిటర్లకు స్పష్టత
ఈ మార్గదర్శకాలతో బ్యాంకులు, ఫైనాన్షియల్ సంస్థలు, అలాగే డిపాజిటర్లకు స్పష్టత పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా వడ్డీ ఆదాయంపై పన్ను లెక్కింపులో ఉండే అనుమానాలను తొలగించి, పన్ను అమలు ప్రక్రియను సులభతరం చేయడంలో ఇవి కీలకంగా మారనున్నాయి.