
Income Tax dept: 7 ఐటీఆర్ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం
ఈ వార్తాకథనం ఏంటి
2025-26మదింపు సంవత్సరానికి గాను ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) ఫారాల్ని ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ప్రకటించింది.
ఇందులో మొత్తం ఏడు రకాల ఫారాలను నోటిఫై చేశారు. చిన్న,మధ్య తరగతి పన్ను చెల్లింపుదారులచే ఎక్కువగా ఉపయోగించే ఐటీఆర్-1,ఐటీఆర్-4 ఫారాలను ఏప్రిల్ 29న నోటిఫై చేయగా, ట్రస్టులు,చారిటబుల్ సంస్థలు ఉపయోగించే ఐటీఆర్-7 ఫారాన్ని మే 11న విడుదల చేశారు.
ఈఏడాది ఫారాల్లో ముఖ్యమైన మార్పు,ఈక్విటీలపై లభించే దీర్ఘకాలిక మూలధన లాభాలకు(లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్-LTGC) సంబంధించింది.
ఒకఆర్థిక సంవత్సరంలో రూ.1.25 లక్షల లోపు ఎల్‌టీసీజీ పొందే వ్యక్తులు ఇప్పుడు ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-4 ద్వారా రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
గతంలో ఇలాంటి ఆదాయాన్ని పొందే వారు తప్పనిసరిగా ఐటీఆర్-2 ద్వారా రిటర్న్ ఫైల్ చేయాల్సి వచ్చేది.
వివరాలు
అదనంగా 12.5 శాతం పన్ను
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్‌ల వంటి ఈక్విటీ ఇన్వెస్ట్మెంట్‌లపై సంవత్సరానికి రూ.1.25 లక్షల వరకు లభించే ఎల్‌టీసీజీ పన్ను మినహాయింపుకు అర్హత కలదు.
అయితే ఆ లాభం ఈ మొత్తాన్ని మించితే, అదనంగా 12.5 శాతం పన్నును చెల్లించాల్సి ఉంటుంది.
పన్ను చెల్లింపుదారులు తమ ఆదాయపు పన్ను రిటర్న్‌లను 2025 జులై 31వ తేదీ వరకు దాఖలు చేయవచ్చు.
ఇక మూలధన లాభాల పన్నుకు సంబంధించి ఐటీఆర్-2,ఐటీఆర్-3, ఐటీఆర్-5, ఐటీఆర్-6, ఐటీఆర్-7లలోనూ కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు.
ముఖ్యంగా 2024 జులై 23 ముందు వచ్చిన లాభాలు, తరువాత వచ్చిన లాభాలను వేర్వేరు విభాగాల్లో చూపించాల్సి ఉంటుంది.
ఇది మూలధన లాభాలను స్పష్టంగా వర్గీకరించేందుకు తీసుకొచ్చిన మార్పు.
వివరాలు
పాత విధానంలో 20 శాతం పన్ను
2024 జులై 24న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ఓ కీలకమైన ప్రతిపాదనను తీసుకొచ్చారు.
దీని ప్రకారం, స్థిరాస్తులపై వచ్చే దీర్ఘకాలిక మూలధన లాభాలను గణించే సమయంలో ఇకపై ద్రవ్యోల్బణ సూచీ సర్దుబాటు అవసరం లేకుండా నేరుగా 12.5 శాతం పన్నును చెల్లించవచ్చు.
అయితే, ఎవరి వద్ద ద్రవ్యోల్బణ సూచీ ఆధారంగా లెక్కించాలన్న ఎంపిక ఉంటే, అలాంటి సందర్భాల్లో పాత విధానంలో 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.