Stock market: పెరిగిన క్రూడాయిల్ ధర.. విండ్‌ఫాల్ టాక్స్ ప్రభావం.. రిలయన్స్ ఇన్వెస్టర్లకు గట్టి షాక్
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టాక్ మార్కెట్ మార్చి 27 (శుక్రవారం) సెషన్‌లో తీవ్ర పతనాన్ని నమోదు చేసింది. గతంలో మార్చి 24, 25 సెషన్లలో వరుస లాభాల తర్వాత ఈ రోజు ఒక్కసారిగా సూచీలు కుప్పకూలాయి. సెన్సెక్స్ 1,690 పాయింట్ల నష్టంతో 73,583 వద్ద నిలిచింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 487 పాయింట్ల తగ్గి 22,820 వద్ద సెషన్ ముగిసింది. ఎస్బీఐ, బీఎస్ఈ, రిలయన్స్, ఎల్ఐసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ వంటి హెవీవెయిట్ స్టాక్స్ భారీ పతనానికి గురయ్యాయి. ఒక్క రోజు సెషన్‌లోనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 9 లక్షల కోట్ల రూపాయల మేర తగ్గి 422 లక్షల కోట్లకు దిగింది.
వివరాలు
ఇన్వెస్టర్ల సంపద సుమారు 90,000 కోట్లు ఆవిరి
రిలయెన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఈ పతనంలో ప్రత్యేకంగా చర్చనీయాంశంగా ఉంది. మార్చి 25 NSE ముగింపు ధర రూ. 1,413.10 ఉండగా, శుక్రవారం సెషన్ ప్రారంభంలో సుమారు 1% నష్టంతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 5% తగ్గి కనిష్ఠంగా రూ. 1,345 కు చేరింది. చివరి క్రమంలో 4.61% పతనంతో రూ. 1,348 వద్ద సెషన్ ముగిసింది. దీనివల్ల రిలయన్స్ మార్కెట్ విలువ రూ. 19.14 లక్షల కోట్ల నుంచి రూ. 18.24 లక్షల కోట్లకు పడిపోయింది. ఫలితంగా ఇన్వెస్టర్ల సంపదలో సుమారు 90,000 కోట్లు నష్టమయ్యాయి. ఈ భారీ పతనానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం వాహించిన ఇంధనంపై విండ్‌ఫాల్ టాక్స్.
వివరాలు
డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 21.5
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు పెరుగుతున్న సందర్భంలో డీజిల్ ఎగుమతులపై లీటరుకు రూ. 21.5, ఏటీఎఫ్ (ATF) పై లీటరుకు రూ. 29.5 చొప్పున విండ్‌ఫాల్ టాక్స్ అమలులోకి వచ్చింది. గతంలో 2024 డిసెంబరులో ఈ టాక్స్ తొలగించబడింది, కానీ ప్రస్తుత పరిస్థితుల్లో మళ్లీ తీసుకురావాల్సి వచ్చింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఓఎన్‌జీసీ లిమిటెడ్, ఆయిల్ ఇండియా వంటి కంపెనీలు దేశీయంగా ముడి చమురును శుద్ధి చేసి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, ATF వంటి ఇంధనాలను ఉత్పత్తి చేస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తాయి. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడు వీటి ద్వారా లాభాలు సాధించగా, ఇప్పుడు విండ్‌ఫాల్ టాక్స్ కారణంగా మార్జిన్లపై ప్రభావం పడుతుంది. దీంతో షేర్ ధర కూడా ఒక్కసారిగా భారీగా దిగిపోయింది.