
RBI: ట్రంప్ 'డెడ్ ఎకానమీ'వ్యాఖ్యలపై.. ఆర్బీఐ గవర్నర్ స్పందన
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఆర్థిక వ్యవస్థను 'డెడ్ ఎకానమీ' అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శించిన నేపథ్యంలో, రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పటిష్ఠంగా కొనసాగుతోందని స్పష్టంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (IMF) విడుదల చేసిన తాజా అంచనాల ప్రకారం ప్రపంచ వృద్ధి రేటు 3 శాతంగా ఉన్నప్పటికీ, భారత్ వృద్ధి రేటు 6.5 శాతంగా ఉండబోతుందని గుర్తుచేశారు. అంతేకాకుండా, ప్రపంచ వృద్ధిలో భారత్ కంట్రిబ్యూషన్ దాదాపు 18 శాతం ఉంటుందనీ, అమెరికా కంట్రిబ్యూషన్ మాత్రం 11 శాతం కంటే తక్కువగా ఉందని వివరించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలంగా కొనసాగుతోందని, భవిష్యత్తులో మరింత అభివృద్ధి సాధించగలమని అన్నారు.
వివరాలు
అమెరికా సుంకాల ప్రభావం ఎంతవరకు?
అమెరికా విధించిన సుంకాల వల్ల భారత ఆర్థిక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం పడవచ్చన్న అంశంపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ స్పందించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రభావాన్ని ఖచ్చితంగా అంచనా వేయడం క్లిష్టమని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న అస్థిరత వృద్ధి రేటుపై ప్రభావం చూపవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం ప్రతీకార చర్యలు తీసుకుంటే తప్ప, వాణిజ్య సుంకాల వల్ల పెద్దగా నష్టమేమీ ఎదురయ్యే అవకాశాలు కనిపించడం లేదన్నారు.
వివరాలు
వృద్ధి అంచనాల్లో మార్పు
ఇప్పటికే ఆర్థిక వృద్ధిపై అంచనాలను కొంతవరకు తగ్గించినట్టు మల్హోత్రా తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో అనిశ్చితి కొనసాగుతుండటంతో, వృద్ధి అంచనాలను 6.7 శాతం నుంచి 6.5 శాతానికి తగ్గించామని చెప్పారు. అయితే ప్రస్తుతం అమెరికా సుంకాల ప్రభావం ఎలా ఉంటుందన్న దానిపై ఖచ్చితమైన విశ్లేషణకు తగినంత డేటా లేనందున, జీడీపీ అంచనాల్లో మరోసారి సవరణ చేయలేమన్నారు. పరిస్థితిని సమయానుకూలంగా పరిశీలిస్తూ, అవసరమైనప్పుడు స్పందిస్తామని చెప్పారు.
వివరాలు
ప్రపంచ ఆర్థిక స్థితిగతులపై దృష్టి
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల విషయంలో మాట్లాడుతూ, ఆర్బీఐ స్థూల ఆర్థిక సంకేతాలను బాగా పరిశీలిస్తున్నామని మల్హోత్రా పేర్కొన్నారు. వడ్డీ రేట్లను ఇప్పటికే 100 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించామని తెలిపారు. ధరల స్థిరత్వాన్ని నిర్ధారిస్తూ, స్థిరమైన వృద్ధికి అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటామని వెల్లడించారు. అమెరికా-భారత్ మధ్య కొనసాగుతున్న వాణిజ్య చర్చలు సానుకూలంగా పరిష్కారానికి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.