LOADING...
India-EU trade agreement: భారత్-ఈయూ మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన
ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

India-EU trade agreement: భారత్-ఈయూ మధ్య 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'.. ఎఫ్‌టీఏపై ప్రధాని మోదీ సంచలన ప్రకటన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 27, 2026
01:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌-యూరోపియన్ యూనియన్ (EU) మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరినట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ''నిన్న భారత్‌, ఈయూ మధ్య ఎఫ్‌టీఏ పూర్తైంది. ప్రపంచవ్యాప్తంగా దీనిని 'మదర్ ఆఫ్ ఆల్ డీల్స్'గా చర్చించుకుంటున్నారు'' అని పేర్కొన్నారు. గోవాలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌-2026ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించిన సందర్భంగా ఈ కీలక వాణిజ్య ఒప్పందంపై మోదీ మాట్లాడారు.

వివరాలు 

ప్రపంచ జీడీపీలో భారత్‌, ఈయూ కలిపి 25 శాతం వాటా

''ఈ ఒప్పందం భారత్‌, యూరోప్ ప్రజలకు విస్తృత అవకాశాలను తెస్తుంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య సమన్వయానికి ఇది స్పష్టమైన ఉదాహరణ. ప్రపంచ జీడీపీలో భారత్‌, ఈయూ కలిపి 25 శాతం వాటా కలిగి ఉన్నాయి. అంతేకాదు, ప్రపంచ వాణిజ్యంలో వీటి వాటా మూడో వంతుకు సమానం. ఈ డీల్‌తో ఇరువర్గాల మధ్య వాణిజ్యం మరింత బలోపేతం అవుతుంది. అలాగే ప్రజాస్వామ్యం, చట్టపాలన పట్ల ఉన్న మా నిబద్ధతను కూడా ఇది బలపరుస్తుంది'' అని ప్రధాని వివరించారు.

వివరాలు 

భారత్‌-ఈయూ శిఖరాగ్ర సమావేశం

ఈ ప్రకటన అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్‌తో సమావేశమయ్యారు. అనంతరం వారు భారత్‌-ఈయూ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. ఇదే ఎనర్జీ వీక్‌లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల నుంచి ప్రతినిధులు గోవాకు హాజరయ్యారు. ''ఇంధన భద్రత, సుస్థిర భవిష్యత్తుపై చర్చించేందుకు మీరంతా భారత్‌కు రావడం ఆనందంగా ఉంది. భారత్‌కు విస్తృత రిఫైనింగ్ సామర్థ్యాలు ఉన్నాయి. ఈ రంగంలో మేం ప్రస్తుతం ప్రపంచంలో రెండో స్థానంలో ఉన్నాం. త్వరలోనే తొలి స్థానాన్ని కూడా సాధిస్తాం'' అని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.

Advertisement