Russian oil: రష్యా చమురుపైనే భారత్ ఫోకస్.. మేలో భారీగా దిగుమతులు పెంపు!
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత్ యథావిధిగా కొనసాగిస్తోంది. మే నెలలో రష్యా నుంచి అత్యధికంగా చమురు దిగుమతి చేసుకున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ఐరోపాకు చెందిన సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ (CREA) విడుదల చేసిన నివేదిక ప్రకారం, మే నెలలో భారత్ మొత్తం 5.8 బిలియన్ యూరోల విలువైన రష్యా ఇంధనం, చమురు ఉత్పత్తులు, బొగ్గును కొనుగోలు చేసింది. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఇంధన ఉత్పత్తుల్లో 83 శాతం ముడి చమురే ఉంది. అదనంగా 429 మిలియన్ యూరోల విలువైన ఇతర పెట్రోలియం ఉత్పత్తులు, 550 మిలియన్ యూరోల విలువైన బొగ్గును కూడా భారత్ కొనుగోలు చేసింది.
వివరాలు
ముడి చమురు దిగుమతులు 21 శాతం పెరుగుదల
ఏప్రిల్‌తో పోలిస్తే మే నెలలో రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ముడి చమురు పరిమాణం 21 శాతం పెరిగినట్లు నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా వడినార్ రిఫైనరీ కొనుగోళ్లు 36 శాతం పెరగగా, జామ్‌నగర్ రిఫైనరీ కొనుగోళ్లు 14 శాతం వృద్ధి చెందాయి. ప్రభుత్వ రంగ రిఫైనరీలూ కొనుగోళ్లు పెంపు ప్రభుత్వ రంగానికి చెందిన చమురు శుద్ధి కర్మాగారాలు కూడా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతులను గణనీయంగా పెంచాయి. గతేడాది నవంబర్‌లో రష్యా చమురు కొనుగోళ్లను నిలిపివేసిన న్యూ మంగళూరు రిఫైనరీ, విశాఖపట్నం రిఫైనరీలు ఈ ఏడాది మార్చి నుంచి మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించాయి. అనంతరం మే నెల నాటికి దిగుమతులను భారీగా పెంచినట్లు నివేదికలో పేర్కొన్నారు.
వివరాలు
రష్యా చమురు ఎగుమతుల్లో భారత్ కీలక పాత్ర
మరోవైపు రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, తుర్కియే, బ్రూనై, జార్జియా దేశాలు కలిపి 641 మిలియన్ యూరోల విలువైన శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను ఎగుమతి చేశాయి. ఈ ఉత్పత్తులను ప్రధానంగా ఐరోపా దేశాలు, ఆస్ట్రేలియా, అమెరికా, న్యూజిలాండ్ దిగుమతి చేసుకున్నాయి. భారత్‌లోని జామ్‌నగర్ రిఫైనరీలో శుద్ధి చేసిన చమురు ఉత్పత్తులను రిలయన్స్ సంస్థ అమెరికాకు ఎగుమతి చేసినట్లు నివేదిక వెల్లడించింది. రష్యాపై పాశ్చాత్య దేశాలు ఆంక్షలు కొనసాగిస్తున్నప్పటికీ, తగ్గింపు ధరలకు అందుబాటులో ఉన్న ముడి చమురును భారత్ పెద్దఎత్తున కొనుగోలు చేస్తూ తన ఇంధన అవసరాలను తీర్చుకుంటోంది. దీంతో రష్యా-భారత్ ఇంధన వాణిజ్యం మరింత బలోపేతం అవుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి.