LOADING...
Petrol,Diesel: జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం
జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం

Petrol,Diesel: జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 29, 2026
07:59 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను కాపాడేందుకు విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది. జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులు మళ్లీ రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద పరిమితులు లేకుండా పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేసేందుకు అనుమతి కల్పించింది. మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్త పరిస్థితులు సరఫరా వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశం ఉందన్న ఆందోళనలతో ప్రభుత్వం జూన్‌లో ఈ ఆంక్షలను అమలు చేసింది. ఆ సమయంలో వాణిజ్య వినియోగదారులు రిటైల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేయకుండా నిషేధించడంతో పాటు, ఒక్కో వినియోగదారు లేదా వాహనానికి రోజుకు గరిష్టంగా 200 లీటర్ల డీజిల్ మాత్రమే విక్రయించేలా పరిమితి విధించింది.

వివరాలు 

సాధారణ స్థితికి పరిస్థితులు

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ అందుబాటులో సమానత్వం ఉండేలా చూడటం, ఇంధనాన్ని నిల్వ చేసి అక్రమంగా మళ్లించడం అరికట్టడం, సరసమైన ధరలకు నిరంతర సరఫరా కొనసాగించడమే ఈ నిర్ణయాల ప్రధాన ఉద్దేశమని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. దీంతో రవాణా సంస్థలు, పరిశ్రమలు వంటి వాణిజ్య వినియోగదారులు ఇకపై పరిమితులు లేకుండా రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి ఇంధనం కొనుగోలు చేసుకోవచ్చు.

వివరాలు 

ఇంధన వినియోగంలో 40 శాతం వాటా డీజిల్‌దే..

జూన్‌లో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం రిటైల్ ధరలు, బల్క్ సరఫరా ధరల మధ్య భారీ వ్యత్యాసం ఉండటమే. ట్రక్కింగ్ కంపెనీలు సహా అనేక వాణిజ్య వినియోగదారులు బల్క్ సరఫరా కేంద్రాల కంటే ప్రభుత్వ చమురు సంస్థల రిటైల్ బంకులలో డీజిల్ తక్కువ ధరకు లభించడంతో అక్కడికే ఎక్కువగా మొగ్గుచూపారు. భారత్‌లో మొత్తం ఇంధన వినియోగంలో సుమారు 40 శాతం వాటా డీజిల్‌దే. పరిశ్రమలకు బల్క్ సరఫరాలో లీటరుకు దాదాపు రూ.40 వరకు అధిక ధర ఉండగా, రిటైల్ బంకుల్లో తక్కువ ధరకు లభించడంతో ధరల వ్యత్యాసాన్ని ఉపయోగించుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లోని పెట్రోల్ బంకులపై సరఫరా ఒత్తిడి పెరిగింది.

Advertisement

వివరాలు 

భుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైపై ప్రభావం

ఈ పరిస్థితి ప్రధానంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలపై ప్రభావం చూపింది. దేశంలోని లక్షకు పైగా ఇంధన కేంద్రాల్లో దాదాపు 90 శాతం ఈ మూడు సంస్థల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. మార్కెట్ ధరలకు సమీపంగా ఇంధనం విక్రయించిన ప్రైవేట్ సంస్థల వద్ద అమ్మకాలు తగ్గగా, ప్రభుత్వ రంగ పెట్రోల్ బంకుల్లో విక్రయాలు గణనీయంగా పెరిగాయి. శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశంగా ఉన్న భారత్, దేశీయ వినియోగదారులకు నిరంతర ఇంధన సరఫరా అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ తాత్కాలిక ఆంక్షలను అమలు చేసింది. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడటంతో వాటిని జూలై 1 నుంచి ఉపసంహరించుకుంది.

Advertisement