LOADING...
Fiscal Deficit: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ ఆర్థిక లోటు పెరగనుందా ?
అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ ఆర్థిక లోటు పెరగనుందా ?

Fiscal Deficit: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ ఆర్థిక లోటు పెరగనుందా ?

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 12, 2026
04:45 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న దానికంటే ఎక్కువ ఆర్థిక లోటు(ఫిస్కల్ డెఫిసిట్)నమోదయ్యే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం జీడీపీలో 4.3శాతం ఫిస్కల్ డెఫిసిట్ లక్ష్యంగా పెట్టుకోగా,దానిని మరో అర శాతం వరకు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. నివేదిక ప్రకారం,ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఫిస్కల్ డెఫిసిట్ జీడీపీలో 4.8శాతానికి చేరే అవకాశం ఉంది. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురుధరలు పెరగడం,హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు సరఫరాకు అంతరాయాలు ఏర్పడటం దీనికి ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు.

వివరాలు 

పెట్రోల్,డీజిల్ ధరలను సుమారు 8 శాతం మేర పెంచినట్లు నివేదిక

చమురు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్‌కు ఈ పరిస్థితి అదనపు భారంగా మారుతోంది. ఇంధన వ్యయాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ రంగ చమురు సంస్థలు పెట్రోల్, డీజిల్ ధరలను సుమారు 8 శాతం మేర పెంచినట్లు నివేదిక తెలిపింది. అలాగే, గృహ వినియోగ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై అందించే సబ్సిడీలను కూడా కేంద్ర ప్రభుత్వం తగ్గించినట్లు సమాచారం. పెరుగుతున్న ఖర్చులను నియంత్రించేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. భారత్ తన చమురు అవసరాల్లో దాదాపు 90 శాతం విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటుంది.

వివరాలు 

ఎరువుల సబ్సిడీ వ్యయం 20 శాతం పెరిగే అవకాశం

దీంతో ఇరాన్ యుద్ధం దీర్ఘకాలం కొనసాగితే ప్రపంచ ఇంధన సరఫరాలో అంతరాయాలు ఏర్పడి దేశ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ఎరువుల సబ్సిడీ వ్యయం కూడా ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, అంతర్జాతీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితులను బట్టి ఈ ఏడాది చివర్లో ఫిస్కల్ డెఫిసిట్‌పై మరోసారి సమీక్ష నిర్వహించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్లూమ్‌బర్గ్ నివేదిక పేర్కొంది.

Advertisement