LPG pipeline: దేశవ్యాప్తంగా LPG పైప్‌లైన్ విస్తరణ.. రూ.12,500 కోట్ల భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో ఎల్పీజీ (LPG) సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గ్యాస్‌ను భారీ ట్యాంకర్ల ద్వారా తరలించే విధానాన్ని తగ్గించడానికి దేశవ్యాప్తంగా ఎల్పీజీ పైప్‌లైన్ నెట్‌వర్క్ అభివృద్ధికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రూ.12,500 కోట్ల అంచనా వ్యయంతో పెద్ద స్థాయి పైప్‌లైన్ విస్తరణ ప్రాజెక్టులను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (PNGRB) నాలుగు కీలక పైప్‌లైన్ ప్రాజెక్టులకు సంబంధించిన టెండర్ ప్రక్రియను ముగింపు దశకు తీసుకెళ్తోంది. మొత్తం సుమారు 2,500 కిలోమీటర్ల పొడవుతో ఈ పైప్‌లైన్లు ఉండనున్నాయి. ఈ ప్రాజెక్ట్ పరిమాణం, ప్రాముఖ్యత ఎంత పెద్దదో దీనివల్ల స్పష్టమవుతోంది.
వివరాలు
మొదటి దశలో ఆ నాలుగు ప్రారంభం..
ఈ నాలుగు పైప్‌లైన్ ప్రాజెక్టుల్లో చెర్లపల్లి-నాగ్‌పూర్ పైప్‌లైన్, శిక్రాపూర్-హుబ్లీ-గోవా పైప్‌లైన్, పరదీప్-రాయ్‌పూర్ పైప్‌లైన్, ఝాన్సీ-సితార్‌గంజ్ పైప్‌లైన్ ఉన్నాయి. మొత్తం తొమ్మిది ఎల్పీజీ పైప్‌లైన్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని నిర్ణయించగా, వాటిలో ఈ నాలుగుకు సంబంధించిన బిడ్డింగ్ ప్రక్రియను PNGRB స్వయంగా ప్రారంభించింది. దేశంలో భారీ స్థాయిలో రోడ్ మార్గం ద్వారా ఎల్పీజీ రవాణాను తగ్గించేందుకు పైప్‌లైన్ మౌలిక వసతుల అభివృద్ధిని వేగవంతం చేస్తున్నట్లు PNGRB వెల్లడించింది. ఈ పైప్‌లైన్లు అవసరమైనప్పుడు నిల్వ సదుపాయాలుగా కూడా ఉపయోగపడతాయని, సరఫరా లోటు లేదా సంక్షోభ సమయంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపింది.
వివరాలు
పర్యావరణానికి ఎంతో మేలు..
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా రిఫైనరీలు, దిగుమతి టెర్మినల్స్ వంటి ప్రధాన సరఫరా కేంద్రాలను ఎల్పీజీ బాటిలింగ్ ప్లాంట్లతో అనుసంధానించనున్నారు. దీంతో దేశంలోని వివిధ ప్రాంతాలకు ఎల్పీజీ సరఫరా నిరాటంకంగా జరిగేలా మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాజెక్ట్ భారతదేశ ఎనర్జీ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసే కీలక అడుగుగా PNGRB పేర్కొంది. పైప్‌లైన్ ద్వారా ఎల్పీజీ రవాణా జరగడం వల్ల భద్రత, విశ్వసనీయత, సామర్థ్యం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకూ మేలు జరుగుతుందని తెలిపింది.
వివరాలు
ఆ ప్రమాదాలు తగ్గించడానికే ప్లాన్..
ఇప్పటివరకు రోడ్డు మార్గంలో ఎల్పీజీ రవాణా సమయంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని, పైప్‌లైన్ విధానానికి మారడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని బోర్డు వెల్లడించింది. దీని వల్ల వినియోగదారులకు మరింత సురక్షితంగా, నమ్మకంగా గ్యాస్ సరఫరా అందుతుందని పేర్కొంది. భారతదేశంలో గృహ వినియోగంతో పాటు వాణిజ్య అవసరాలకు కూడా ఎల్పీజీ వినియోగం కీలకమని PNGRB గుర్తించింది. అందువల్ల పోర్టులు, రిఫైనరీలను బాటిలింగ్ ప్లాంట్లతో సమర్థవంతంగా కలపాల్సిన అవసరం ఉందని తెలిపింది. ప్రస్తుతం పైప్‌లైన్ రవాణా ఉత్తమ మార్గంగా భావించినప్పటికీ, ఇంకా పెద్ద మొత్తంలో ఎల్పీజీ ట్యాంకర్ల ద్వారానే రవాణా జరుగుతోందని పేర్కొంది.