LOADING...
India and Oman: హర్మూజ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. ఒమన్‌తో చారిత్రక ఒప్పందం
హర్మూజ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. ఒమన్‌తో చారిత్రక ఒప్పందం

India and Oman: హర్మూజ్‌ సంక్షోభం వేళ భారత్‌కు ఊరట.. ఒమన్‌తో చారిత్రక ఒప్పందం

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 01, 2026
04:53 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్‌ జలసంధి పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో అనిశ్చిత పరిస్థితులను ఎదుర్కొంటున్న వేళ, భారత్‌కు ఒమన్‌తో కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) వ్యూహాత్మకంగా ఎంతో కీలకంగా మారింది. ఈ ఒప్పందం ద్వారా హర్మూజ్‌ జలసంధిపై పూర్తిగా ఆధారపడకుండా గల్ఫ్‌ దేశాల నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించే అవకాశాలు భారత్‌కు లభించాయని వాణిజ్య నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

చారిత్రక వాణిజ్య ఒప్పందం

భారత్‌, ఒమన్‌ల మధ్య వ్యూహాత్మక, ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. గత ఏడాది డిసెంబరులో ప్రధాని నరేంద్ర మోదీ మస్కట్‌ పర్యటన సందర్భంగా ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. జూన్‌ 1 నుంచి ఈ ఒప్పందం అమల్లోకి వచ్చినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం భారత్‌ నుంచి ఒమన్‌కు ఎగుమతి అయ్యే 99.38శాతం ఉత్పత్తులపై సుంకాలను పూర్తిగా తొలగించారు. రత్నాలు,ఆభరణాలు,వస్త్రాలు, తోలు ఉత్పత్తులు,పాదరక్షలు,ప్లాస్టిక్‌ వస్తువులు,ఫర్నీచర్‌,వ్యవసాయ ఉత్పత్తులు,ఇంజినీరింగ్‌ వస్తువులు, ఔషధాలు, వైద్య పరికరాలు, ఆటోమొబైల్‌ ఉత్పత్తులు తదితరాలు ఈ జాబితాలో ఉన్నాయి.

వివరాలు 

ఒమన్‌ భౌగోళిక స్థానం భారత్‌కు కలిసొచ్చే అంశం

దీంతో భారతీయ ఉత్పత్తులకు ఒమన్‌ మార్కెట్లో మరింత ప్రాధాన్యం దక్కే అవకాశం ఏర్పడింది. అదే సమయంలో ఒమన్‌ నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తుల్లో సుమారు 78 శాతం వాటిపై భారత్‌ సుంకాల మినహాయింపును ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం హర్మూజ్‌ జలసంధి మార్గంగానే రవాణా అవుతోంది. అందువల్ల ఈ జలసంధికి ప్రపంచ ఇంధన రంగంలో అత్యంత ప్రాధాన్యం ఉంది. అయితే ఇటీవల పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, అమెరికా-ఇరాన్‌ మధ్య ఘర్షణల ప్రభావంతో ఈ మార్గంలో నౌకా రవాణాపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

వివారాలు 

ఈ ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతులను పెంచిన భారత్‌ 

ఇలాంటి సమయంలో ఒమన్‌తో కుదిరిన ఒప్పందం భారత్‌కు ప్రత్యామ్నాయ మార్గాన్ని అందిస్తోంది. ఒమన్‌ తీర ప్రాంతంలో ఎక్కువ భాగం హర్మూజ్‌ జలసంధికి వెలుపల ఉండటం దీనికి ప్రధాన కారణం. గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌, అరేబియా సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్న సలాలా, దుఖ్మ్‌ వంటి నౌకాశ్రయాల ద్వారా హర్మూజ్‌లో అంతరాయాలు ఏర్పడినా ఇంధన సరఫరాను కొనసాగించే అవకాశం భారత్‌కు లభిస్తుంది. గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చ్‌ ఇనిషియేటివ్‌ వ్యవస్థాపకుడు అజయ్‌ శ్రీవాస్తవ్‌ అభిప్రాయం ప్రకారం,ఈ పోర్టులు భవిష్యత్తులో భారత్‌ ఇంధన భద్రతకు కీలక కేంద్రాలుగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతాల నుంచి ముడి చమురు దిగుమతులను భారత్‌ పెంచుతోంది.

Advertisement

వివరాలు 

ఒమన్‌ నుంచి దిగుమతుల్లో భారీ పెరుగుదల

గత ఏడాది ఏప్రిల్‌లో గల్ఫ్‌ దేశాల నుంచి భారత్‌కు సుమారు 15 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు దిగుమతి అయ్యాయి. అయితే ఈ ఏడాది పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావంతో ఆ దిగుమతుల విలువ 9.8 బిలియన్‌ డాలర్లకు తగ్గింది. అయితే అదే సమయంలో ఒమన్‌ నుంచి భారత్‌కు దిగుమతులు 246.4 శాతం పెరిగి 1.5 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం విశేషం. ఈ దిగుమతుల్లో ప్రధానంగా ముడి చమురు, యూరియా ఉన్నాయి.

వివరాలు 

ఒమన్‌ నుంచి దిగుమతుల్లో భారీ పెరుగుదల

2025-26 ఆర్థిక సంవత్సరంలో ఒమన్‌ నుంచి భారత్‌ మొత్తం 7.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంది. ఇందులో 1.6 బిలియన్‌ డాలర్ల విలువైన ముడి చమురు, 1.2 బిలియన్‌ డాలర్ల విలువైన ఎల్‌ఎన్‌జీ ఉన్నాయి. మరోవైపు భారత్‌ నుంచి ఒమన్‌కు 3.64 బిలియన్‌ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. రిఫైన్డ్‌ పెట్రోలియం ఉత్పత్తులు, ఉక్కు, స్టీల్‌, బియ్యం వంటి వస్తువులు ఈ ఎగుమతుల్లో ప్రధాన వాటా కలిగి ఉన్నాయి.

Advertisement