Sanchar saathi app: కొత్త మొబైళ్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయడం కుదరదు..!
ఈ వార్తాకథనం ఏంటి
మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై కొత్తగా తయారయ్యే ప్రతి మొబైల్‌లో కేంద్రం రూపొందించిన సైబర్ సెక్యూరిటీ యాప్‌ను తప్పనిసరిగా డిఫాల్ట్‌గా ప్రీ-ఇన్‌స్టాల్ చేసి ఇవ్వాలని సూచించింది. ఇతర యాప్‌ల మాదిరిగా యూజర్లు ఈ యాప్‌ను తొలగించే అవకాశం ఉండదని తెలుస్తోంది. ఈ విషయాన్ని అంతర్జాతీయ వార్తా సంస్థ 'రాయిటర్స్' తన కథనంలో వెల్లడించింది. దేశంలో ప్రస్తుతం 100 కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులు ఉండగా, చోరీలు, సైబర్ మోసాలు పెద్ద సమస్యగా మారుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
వివరాలు
యాప్ సహాయంతో ఇప్పటివరకు సుమారు 7 లక్షలకు పైగా చోరీకి గురైన ఫోన్లు
ఈ నేపథ్యంలో పోయిన మొబైళ్లను కనుగొనేందుకు 'సంచార్ సాథీ' (Sanchar Saathi) యాప్‌ను ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ యాప్ సహాయంతో ఇప్పటివరకు సుమారు 7 లక్షలకు పైగా చోరీకి గురైన ఫోన్లను గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఐఎంఈఐ స్పూఫింగ్‌ను అడ్డుకోవడం, సైబర్ ముప్పులను తగ్గించడం వంటి విషయాల్లో ఈ యాప్ కీలకంగా పనిచేస్తోంది. అందువల్లే ఇకపై ప్రతి కొత్త మొబైల్‌లో ఈ యాప్ డిఫాల్ట్‌గా ఉండాలంటూ టెలికాం శాఖ మొబైల్ తయారీ సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వివరాలు
ఆదేశాల అమలుకు కేంద్రం కంపెనీలకు 90రోజుల గడువు
ఈ ఆదేశాల అమలుకు కేంద్రం కంపెనీలకు 90రోజుల గడువును ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే సరఫరా దశలో ఉన్న స్మార్ట్‌ఫోన్లకు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ ద్వారా ఈ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావాలని కూడా ప్రభుత్వ సూచనలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే,తమ స్వంత యాప్‌లు తప్ప ప్రభుత్వ లేదా మూడో పక్ష యాప్‌లను ముందస్తుగా ఇన్‌స్టాల్ చేయడాన్ని యాపిల్ వ్యతిరేకిస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి ప్రభుత్వ ఆదేశాలను యాపిల్ నిరాకరించిన సందర్భాలు ఉన్నాయని సమాచారం. ఈనేపథ్యంలో ఈ తాజా నిర్ణయంపై ఆపిల్ నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కానీ,ఈ అంశంపై ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం గానీ,ప్రముఖ మొబైల్ కంపెనీలైన యాపిల్, గూగుల్,శాంసంగ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.