7దేశాల్లో బాస్మతీయేతర బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతి
బాస్మతీయేతర బియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో బియ్యం ధరలను నియంత్రించేందుకు కేంద్రం ఈ ఏడాది జులైలో ఎగుమతులపై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆంక్షలను సడలిస్తూ.. 7దేశాల్లో బాస్మతీయేతర తెల్ల బియ్యాన్ని 10,34,800 టన్నుల వరకు ఎగుమతి చేసేందుకు కేంద్రం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నేపాల్, కామెరూన్, ఐవరీ కోస్ట్, రిపబ్లిక్ ఆఫ్ గినియా, మలేషియా, ఫిలిప్పీన్స్, సీషెల్స్‌లు అనుమతిచ్చిన దేశాల జాబితాలో ఉన్నాయి. ఆహార ద్రవ్యోల్బణం పెరగడంతో జులై 20న బాస్మతీయేతర బియ్యం ఎగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారుగా ఉంది. 2022లో ప్రపంచ బియ్యం వ్యాపారంలో దాదాపు 40 శాతం వాటాను కలిగి ఉంది.