EU tariffs : EU కార్లపై దిగుమతి సుంకాలకు కత్తెర… 110% నుంచి 40%కి తగ్గించేందుకు భారత్ ప్లాన్
ఈ వార్తాకథనం ఏంటి
యూరోపియన్ యూనియన్ (EU)తో కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నేపథ్యంలో, భారత్ కార్ల దిగుమతి సుంకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం 110 శాతం వరకు ఉన్న EU కార్లపై దిగుమతి సుంకాన్ని 40 శాతానికి తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు,చర్చలపై అవగాహన ఉన్న వర్గాలు రాయిటర్స్‌కు వెల్లడించాయి. ఈ ఒప్పందం మంగళవారమే తుది రూపు దాల్చే అవకాశముందని చెబుతున్నారు.వర్గాల సమాచారం ప్రకారం,సుమారు రూ.16.3 లక్షలు(సుమారు 17,739 డాలర్లు)కంటే ఎక్కువ దిగుమతి ధర ఉన్న కొద్ది సంఖ్యలో EU కార్లపై ముందుగా సుంకం తగ్గించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. దశలవారీగా ఈ కార్లపై దిగుమతి సుంకాన్ని భవిష్యత్తులో 10 శాతానికి తగ్గించే యోచన కూడా ఉందని తెలుస్తోంది.
వివరాలు
న్యూఢిల్లీ-బ్రస్సెల్స్ వాణిజ్య చర్చల్లో ఇది ప్రధాన రాయితీ
డొనాల్డ్ ట్రంప్ పాలనలోని విధానాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, భద్రతా అంశాలపై ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్‌లో ఇప్పటివరకు కఠినంగా రక్షించబడుతున్న ఆటోమొబైల్ మార్కెట్‌ను మరింతగా తెరచే దిశగా ఇది ఒక కీలక అడుగుగా భావిస్తున్నారు. న్యూఢిల్లీ-బ్రస్సెల్స్ మధ్య చాలా కాలంగా సాగుతున్న వాణిజ్య చర్చల్లో ఇది ప్రధాన రాయితీగా కనిపిస్తోంది. ఈ సుంకాల తగ్గింపు వల్ల వోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్,బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ కార్ల తయారీ సంస్థలకు భారత మార్కెట్‌లోకి ప్రవేశం మరింత సులభం కానుంది. దిగుమతి సుంకాలు తగ్గించాలని ఈ కంపెనీలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ పరిణామంపై కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ గానీ,యూరోపియన్ కమిషన్ గానీ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
వివరాలు
భారత్-EU సంబంధాలను మరింత బలోపేతం
దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమను రక్షించడంతో పాటు,స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు భారత్ ప్రపంచంలోనే అత్యధిక దిగుమతి సుంకాలు విధిస్తున్న దేశాల్లో ఒకటిగా ఉంది. అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున సుంకాల తగ్గింపు జరిగితే, ఆటో రంగంపై,భారత్-EU ద్వైపాక్షిక వాణిజ్యంపై,భవిష్యత్తు పెట్టుబడులపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ పరిణామం యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్ నాలుగు రోజుల భారత పర్యటన సమయంలో జరగనుంది. భారత్-EU సంబంధాలను మరింత బలోపేతం చేసే పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఆమె భారత్‌కు వచ్చారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథులుగా యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టాతో కలిసి ఆమె హాజరవుతున్నారు.
వివరాలు
శిఖరాగ్ర స్థాయి చర్చలు
మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీతో శిఖరాగ్ర స్థాయి చర్చలు జరగనున్నాయి. ఈ సందర్భంగా భారత్-EU మధ్య దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంతో పాటు, వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం, భారత నిపుణుల చలనం సులభతరం చేసే ఫ్రేమ్‌వర్క్‌ను కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.