Vande Bharat Trains: అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ ఖర్చుతో వందే భారత్ రైళ్లు.. ఎగుమతులకు భారత్ సిద్ధం
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారీ ఖర్చుతో కూడిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు బదులుగా.. తక్కువ వ్యయంతో వేగవంతమైన రైలు సేవలు అందించే మోడల్‌గా వందే భారత్‌ను అభివృద్ధి చెందుతున్న దేశాలకు పరిచయం చేయాలని భావిస్తోంది. పాతబడిన రైల్వే వ్యవస్థలను ఆధునీకరించాలనుకునే దేశాలకు ఇది మంచి ప్రత్యామ్నాయంగా మారొచ్చని భారత్ అంచనా వేస్తోంది.
వివరాలు
స్టాండర్డ్ గేజ్ వందే భారత్ డిజైన్
ప్రభుత్వ రంగ సంస్థ రైట్స్ (RITES), భారతీయ రైల్వేలు కలిసి అంతర్జాతీయ మార్కెట్ల కోసం ప్రత్యేక స్టాండర్డ్ గేజ్ వందే భారత్ రైళ్ల డిజైన్‌ను రూపొందిస్తున్నాయి. ప్రస్తుతం భారత్‌లో బ్రాడ్ గేజ్ ట్రాక్‌లపై నడుస్తున్న వందే భారత్ రైళ్లు విదేశీ రైల్వే నెట్‌వర్క్‌లకు సరిపడేలా మార్పులు చేయనున్నారు. ఇప్పటికే బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ దేశాలు ఈ రైళ్లపై ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. తక్కువ ఖర్చుతో వేగవంతమైన రైలు సేవలు చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాలు నిర్మిస్తున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులకు భారీ మౌలిక వసతులు అవసరం అవుతాయి. అయితే వందే భారత్ రైళ్లు ఇప్పటికే ఉన్న రైల్వే ట్రాక్‌లను ఆధునీకరించి నడపవచ్చు.దీంతో ఖర్చు భారీగా తగ్గుతుంది.
వివరాలు
'మేక్ ఇన్ ఇండియా' సామర్థ్యానికి గుర్తింపు
ప్రస్తుతం 16 కోచ్‌ల వందే భారత్ రైలును తయారు చేయడానికి రూ.130 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు వ్యయం అవుతోందని రైల్వే అధికారులు చెబుతున్నారు. వందే భారత్ రైళ్లలో ఉపయోగిస్తున్న భాగాల్లో దాదాపు 90 శాతం దేశీయంగా తయారవుతున్నాయి. దీంతో 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమానికి ఇవి ప్రతీకగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా భారత తయారీ సామర్థ్యాన్ని చాటిచెప్పే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు.
వివరాలు
ఆఫ్రికా దేశాలపై భారత్ దృష్టి
పక్క దేశాలతో పాటు ఆఫ్రికా మార్కెట్లపైనా భారత్ దృష్టి పెట్టింది. మొజాంబిక్‌కు ఇప్పటికే 10 లోకోమోటివ్‌ల సరఫరా పూర్తి చేసిన రైట్స్.. మరో ఐదు ఇంజిన్‌ల ఆర్డర్ కూడా పొందింది. అలాగే బంగ్లాదేశ్‌కు 200 రైల్వే కోచ్‌ల సరఫరా ప్రక్రియ ప్రారంభమవుతోంది. తొలి విడత కోచ్‌ల నమూనాను ఢాకా ప్రభుత్వం ఆమోదించినట్లు సమాచారం. దేశీయంగా వందే భారత్ విస్తరణ ఎగుమతులపై దృష్టి పెట్టినా దేశీయంగా వందే భారత్ విస్తరణను భారతీయ రైల్వేలు వేగంగా కొనసాగిస్తున్నాయి. 2030 నాటికి 800 వందే భారత్ ట్రైన్‌సెట్‌లను ప్రవేశపెట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2047 నాటికి ఈ సంఖ్యను 4,500కు పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న చైర్‌కార్ మోడళ్లతో పాటు స్లీపర్ వేరియంట్లను కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు.
వివరాలు
ప్రపంచానికి మధ్యస్థ పరిష్కారంగా వందే భారత్
ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలు పెరుగుతున్న అప్పులు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య తక్కువ ఖర్చుతో మెరుగైన రవాణా మార్గాలను వెతుకుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయి బుల్లెట్ ట్రైన్ వ్యవస్థల కంటే.. తక్కువ ఖర్చుతో ఆధునిక రైలు సేవలు అందించే ప్రత్యామ్నాయంగా వందే భారత్ నిలుస్తుందని భారత్ భావిస్తోంది.