LOADING...
Dak Sewa App: 'డాక్ సేవ' యాప్‌ - పోస్టాఫీస్‌ ఇప్పుడు మీ చేతుల్లోనే!
'డాక్ సేవ' యాప్‌ - పోస్టాఫీస్‌ ఇప్పుడు మీ చేతుల్లోనే!

Dak Sewa App: 'డాక్ సేవ' యాప్‌ - పోస్టాఫీస్‌ ఇప్పుడు మీ చేతుల్లోనే!

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
07:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

తపాలా సేవలను ప్రజలకు మరింత సులభంగా, వేగంగా చేరువ చేయాలనే లక్ష్యంతో పోస్టల్‌ శాఖ ఓ కొత్త అడుగు వేసింది. ప్రజలకు తమ సేవలను డిజిటల్‌ రూపంలో అందించేందుకు "డాక్ సేవ (Dak Sewa App)" పేరుతో సరికొత్త మొబైల్‌ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా ఎక్కడి నుంచైనా తపాలా శాఖ సేవలను స్మార్ట్‌ఫోన్‌లోనే పొందవచ్చు. ఈ నేపథ్యంలో "ఇక పోస్టాఫీస్‌ మీ జేబులోనే" అంటూ పోస్టల్‌ డిపార్ట్‌మెంట్‌ తమ అధికారిక ఎక్స్‌ (X) ఖాతాలో ప్రకటించింది.

వివరాలు 

స్పీడ్‌పోస్ట్‌, మనీ ఆర్డర్‌ వివరాలను రియల్‌టైమ్‌లో ట్రాక్‌ చేయగలరు

తమ శాఖ అందించే అన్ని యుటిలిటీ సేవలు ఇప్పుడు ఈ యాప్‌లో లభిస్తాయని తపాలా శాఖ తెలిపింది. పార్సిల్‌ ట్రాకింగ్‌, పోస్టేజ్‌ లెక్కింపు, కంప్లయింట్‌ నమోదు, ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లింపు వంటి సేవలను ఈ యాప్‌ ద్వారా తక్షణమే వినియోగించుకోవచ్చు. స్పీడ్‌పోస్ట్‌, మనీ ఆర్డర్‌ వివరాలను రియల్‌టైమ్‌లో ట్రాక్‌ చేయగలరు. దేశీయ, అంతర్జాతీయ పార్సిల్‌ సేవలకు సంబంధించిన ఛార్జీలను కూడా యాప్‌ వెంటనే లెక్కిస్తుంది. ఇక స్పీడ్‌పోస్ట్‌, రిజిస్టర్డ్‌ పోస్టు లేదా పార్సిల్‌ బుకింగ్‌ కోసం గంటల తరబడి పోస్టాఫీస్‌లో లైన్లో నిలబడే అవసరం లేదు. ఈ సేవలను యాప్‌ ద్వారానే నేరుగా పూర్తిచేయవచ్చు.

వివరాలు 

కార్పొరేట్‌ కస్టమర్ల కోసం ప్రత్యేక విభాగం

యాప్‌లో జీపీఎస్‌ ఆధారంగా సమీప పోస్టాఫీసుల వివరాలు కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా కార్పొరేట్‌ కస్టమర్ల కోసం ప్రత్యేక విభాగంను కూడా ఇందులో ఏర్పాటు చేశారు. యాప్‌ డౌన్‌లోడ్‌ చేయడం చాలా సులభం. గూగుల్‌ ప్లే స్టోర్‌ లేదా యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో "Dak Sewa App" అని టైప్‌ చేసి,"Department of Posts, Government of India"పేరుతో ఉన్న అధికారిక యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. యాప్‌ ఓపెన్‌ చేసిన తరువాత మొబైల్‌ నంబర్‌ లేదా ఈమెయిల్‌ ఐడీతో రిజిస్టర్‌ కావాలి. ఓటీపీ ద్వారా లాగిన్‌ అయ్యి తపాలా శాఖ అందించే అన్ని సేవలను పొందవచ్చు. మరిన్ని వివరాలు, యూజర్‌ సపోర్ట్‌,పాలసీ అప్‌డేట్ల కోసం www.indiapost.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని పోస్టల్‌ శాఖ సూచించింది.