Loading...
Starlink Row: ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌.. 'అందరికీ ఒకే నిబంధనలు'
ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌.. 'అందరికీ ఒకే నిబంధనలు'

Starlink Row: ఎలాన్‌ మస్క్‌ ఆరోపణలకు భారత్‌ కౌంటర్‌.. 'అందరికీ ఒకే నిబంధనలు'

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2026
11:41 am

ఈ వార్తాకథనం ఏంటి

స్టార్‌లింక్‌ శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను భారత్‌లో ప్రారంభించకుండా కొందరు కావాలనే అడ్డుకుంటున్నారంటూ అమెరికా బిలియనీర్‌, స్పేస్‌ఎక్స్‌ అధినేత ఎలాన్‌ మస్క్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. గుత్తాధిపత్య శక్తులు తమ ప్రయోజనాలను కాపాడుకునేందుకు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నాయని ఆయన ఆరోపించారు. అయితే మస్క్‌ వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశంలో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు అనుమతుల ప్రక్రియ నిబంధనల ప్రకారమే, ఎలాంటి వివక్ష లేకుండా జరుగుతోందని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

వివరాలు 

శాటిలైట్‌ సేవలకు అందరికీ ఒకే నిబంధనలు

భారత్‌లో శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలు అందించేందుకు ఇప్పటివరకు మూడు సంస్థలకు గ్లోబల్‌ మొబైల్‌ పర్సనల్‌ కమ్యూనికేషన్‌ బై శాటిలైట్‌ (GMPCS) లైసెన్సులు మంజూరయ్యాయి.

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌తో పాటు భారతి గ్రూప్‌ మద్దతున్న యూటెల్‌శాట్‌ వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ ఈ లైసెన్సులు పొందాయి.

అమెజాన్‌కు చెందిన లియో కూడా భారత మార్కెట్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తోంది.

లైసెన్స్‌ పొందిన సంస్థలన్నీ తప్పనిసరిగా భద్రతా నిబంధనలను పాటించాల్సిందేనని కేంద్రం తెలిపింది.

వినియోగదారుల భద్రత, వారి డేటా రక్షణ తదితర అంశాలను నిర్ధారించేందుకే ఈ పరిశీలన ప్రక్రియను అమలు చేస్తున్నట్లు వివరించింది.

ప్రస్తుతం లైసెన్స్‌ పొందిన మూడు సంస్థలకు సంబంధించి భద్రతా పరిశీలన కొనసాగుతోందని వెల్లడించింది.

వివరాలు 

శాటిలైట్‌ సేవలకు అందరికీ ఒకే నిబంధనలు

భద్రతా ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలు స్పెక్ట్రమ్‌ కేటాయింపునకు సంబంధించిన తదుపరి దశకు వెళ్లే అవకాశం ఉంటుంది.

అంతేకాదు.. స్టార్‌లింక్‌, వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ దాదాపు ఒకే నియంత్రణ దశలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

కాబట్టి స్టార్‌లింక్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకుని అనుమతులను నిలిపివేశారన్న ఆరోపణలకు ఎలాంటి ఆధారం లేదని తేల్చింది.

ADVERTISEMENT

వివరాలు 

మస్క్‌ ఏమన్నారు?

ఈ వివాదానికి కారణం మస్క్‌ తన 'ఎక్స్‌' ఖాతాలో చేసిన ఓ పోస్టు. భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించేందుకు కొందరు స్టార్‌లింక్‌ను అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

వాళ్లు ఎవరన్నది ఊహించడం పెద్ద కష్టమేమీ కాదంటూ పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇది భారత ప్రజలపై జరుగుతున్న అన్యాయమని పేర్కొన్నారు.

అయితే తన పోస్టులో ఎవరినీ నేరుగా పేరుతో ప్రస్తావించలేదు.

భారత్‌లో స్టార్‌లింక్‌ సేవల ప్రారంభానికి అవసరమైన అనుమతులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో మస్క్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

స్టార్‌లింక్‌కు ఇప్పటికే GMPCS లైసెన్స్‌ లభించినప్పటికీ.. వాణిజ్య సేవలను ప్రారంభించడానికి భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు సహా మరికొన్ని తుది అనుమతులు ఇంకా అవసరమవుతున్నాయి.

ADVERTISEMENT

వివరాలు 

'సేవలు ప్రారంభించేందుకు సిద్ధం'

మస్క్‌ ఆరోపణలు చేయడానికి కొన్ని గంటల ముందే స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలు ప్రారంభించేందుకు పూర్తిగా సిద్ధంగా ఉందని సంస్థ సీనియర్‌ అధికారి లారెన్‌ డ్రేయర్‌ తెలిపారు.

ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌-2026లో మాట్లాడిన ఆమె.. భారత భద్రతా నిబంధనలు,ఇతర నియంత్రణ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక వ్యవస్థను రూపొందించినట్లు చెప్పారు.

భారత వినియోగదారుల డేటా దేశం వెలుపలికి వెళ్లకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు డ్రేయర్‌ వెల్లడించారు.

భారత్‌లో ఇప్పటికే మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టామని తెలిపారు.

ఇందులో భాగంగా సుమారు 20గేట్‌వే సైట్లు,వందలాది యాంటెనాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు.

సేవలను ప్రారంభించేందుకు తమ కార్యకలాపాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.

భారత్‌లోని నియంత్రణ సంస్థలు,టెలికాం కంపెనీలు,పరిశ్రమ వర్గాలతో గత ఐదేళ్లుగా కలిసి పనిచేస్తున్నామని డ్రేయర్‌ పేర్కొన్నారు.

వివరాలు 

తుది అనుమతులపైనే ఉత్కంఠ

దేశంలోని మారుమూల ప్రాంతాలకు ఇంటర్నెట్‌ కనెక్టివిటీని అందించడంలో శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ కీలక పాత్ర పోషించగలదని చెప్పారు.

స్టార్‌లింక్‌ ఇప్పటికే భారత ప్రభుత్వ అనుమతుల ప్రక్రియలో కీలక దశలను పూర్తి చేసింది.

అయితే తుది భద్రతా అనుమతులు, స్పెక్ట్రమ్‌ కేటాయింపు వంటి అంశాల్లో ప్రక్రియ ఇంకా పూర్తికావాల్సి ఉంది.

మరోవైపు వన్‌వెబ్‌, జియో శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌ కూడా ఇదే నియంత్రణ విధానాన్ని అనుసరిస్తున్నాయని కేంద్రం చెబుతోంది.

దీంతో స్టార్‌లింక్‌ను మాత్రమే భారత్‌ కావాలనే అడ్డుకుంటోందన్న మస్క్‌ ఆరోపణలకు కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇచ్చినట్లయింది.

శాటిలైట్‌ కమ్యూనికేషన్‌ సేవలకు సంబంధించి సంస్థలన్నింటికీ ఒకే భద్రతా, నియంత్రణ నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పింది.

ADVERTISEMENT