LOADING...
BRICS' digital currencies: BRICS దేశాల CBDCల అనుసంధానానికి RBI ప్రతిపాదన
BRICS దేశాల CBDCల అనుసంధానానికి RBI ప్రతిపాదన

BRICS' digital currencies: BRICS దేశాల CBDCల అనుసంధానానికి RBI ప్రతిపాదన

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 20, 2026
08:39 am

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ సరిహద్దు వాణిజ్యం, ఆర్థిక లావాదేవీలు, పర్యాటకానికి సంబంధించిన చెల్లింపులను మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో నిర్వహించే దిశగా కీలక అడుగు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో BRICS దేశాల అధికారిక డిజిటల్ కరెన్సీలను (CBDCs) పరస్పరం అనుసంధానించాలనే ప్రతిపాదనను భారత కేంద్ర బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ముందుకు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై అవగాహన ఉన్న ఇద్దరు అధికారిక వర్గాలు ఈ సమాచారాన్ని వెల్లడించాయని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.

వివరాలు 

2026లో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశం

ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్య సంబంధిత సంక్షోభాల నేపథ్యంలో ఈ ప్రతిపాదనకు ప్రాధాన్యత ఏర్పడింది. దీని అమలు జరిగితే అంతర్జాతీయ లావాదేవీల్లో అమెరికా డాలర్‌పై ఆధారపడటం క్రమంగా తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ ప్రతిపాదనను 2026లో జరగనున్న BRICS శిఖరాగ్ర సమావేశం ఎజెండాలో చేర్చాలని RBI సూచించినట్లు సమాచారం. ఈ సమావేశానికి ఈ ఏడాది చివర్లో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ప్రతిపాదనకు ఆమోదం లభిస్తే, BRICS దేశాల మధ్య సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీలను నేరుగా అనుసంధానించేందుకు చేపట్టే తొలి అధికారిక ప్రయత్నంగా ఇది నిలవనుంది. ఈ అంశంపై బహిరంగంగా మాట్లాడే అధికారం లేనందున సంబంధిత వర్గాలు తమ పేర్లు వెల్లడించడానికి నిరాకరించినట్లు రాయిటర్స్ తెలిపింది.

వివరాలు 

డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటే సుంకాలు

ప్రస్తుతం BRICS కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్,చైనా,దక్షిణాఫ్రికాతో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్,ఇరాన్,ఇండోనేషియా వంటి కొత్త సభ్య దేశాలు కూడా చేరాయి. ఈ కూటమి చేపట్టే చర్యలు అమెరికా దృష్టిని ఆకర్షించే అవకాశముంది.ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ BRICS‌ను అమెరికా వ్యతిరేక కూటమిగా విమర్శిస్తున్నారు. డాలర్ ఆధిపత్యాన్ని తగ్గించే చర్యలు తీసుకుంటే సుంకాలు విధిస్తామని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఈ అంశంపై స్పందన కోరుతూ రాయిటర్స్ RBI,భారత ఆర్థిక మంత్రిత్వ శాఖలను సంప్రదించగా, వారు ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపింది. అలాగే బ్రెజిల్,రష్యా కేంద్ర బ్యాంకుల నుంచి కూడా స్పందన రాలేదు. చైనా కేంద్ర బ్యాంకు తమ వద్ద పంచుకునే సమాచారం లేదని చెప్పగా,దక్షిణాఫ్రికా ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించింది.

Advertisement

వివరాలు 

భారత డిజిటల్ రూపాయిని ఇతర దేశాల CBDCలతో అనుసంధానిస్తే సరిహద్దు లావాదేవీల సెటిల్‌మెంట్ సామర్థ్యం

ముఖ్యంగా వాణిజ్యం, పర్యాటక చెల్లింపుల కోసం BRICS దేశాల CBDCలను అనుసంధానించే ప్రతిపాదన గతంలో ఎక్కడా బహిరంగంగా వెలుగులోకి రాలేదని తెలుస్తోంది. 2025లో బ్రెజిల్‌లోని రియో డి జనీరోలో జరిగిన BRICS శిఖరాగ్ర సమావేశంలో సభ్య దేశాలు సరిహద్దు లావాదేవీలను వేగవంతం చేయడం,ఖర్చులు తగ్గించడం కోసం చెల్లింపు వ్యవస్థల మధ్య పరస్పర అనుసంధానం అవసరమని ప్రకటించాయి. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే ఈ తాజా ప్రతిపాదన ముందుకు వచ్చినట్లు భావిస్తున్నారు. భారత డిజిటల్ రూపాయిని ఇతర దేశాల CBDCలతో అనుసంధానిస్తే సరిహద్దు లావాదేవీల సెటిల్‌మెంట్ సామర్థ్యం మెరుగవుతుందని,అలాగే రూపాయి అంతర్జాతీయ వినియోగం కూడా పెరుగుతుందని RBI అభిప్రాయపడుతోంది. అయితే, ఈ చర్యలు డీ-డాలరైజేషన్‌ను లక్ష్యంగా చేసుకుని చేపట్టినవి కావని RBI స్పష్టంచేసినట్లు సమాచారం.

Advertisement

వివరాలు 

భారత్ 2022 డిసెంబరులో ప్రారంభించిన ఈ-రూపాయి

ప్రస్తుతం BRICS దేశాల్లో ఏ దేశం కూడా పూర్తిస్థాయిలో రిటైల్ CBDCని అమలు చేయలేదు. అయితే ఐదు దేశాలు పైలట్ ప్రాజెక్టుల ద్వారా ప్రయోగాత్మకంగా డిజిటల్ కరెన్సీలను వినియోగిస్తున్నాయి. భారత్ 2022 డిసెంబరులో ప్రారంభించిన ఈ-రూపాయి ఇప్పటికే దాదాపు 70లక్షల మంది వినియోగదారులను ఆకర్షించింది. ఇదే సమయంలో చైనా తన డిజిటల్ యువాన్‌ను అంతర్జాతీయంగా విస్తరించే దిశగా ఆసక్తి చూపుతోంది. అయితే BRICS దేశాల CBDCల అనుసంధానం విజయవంతం కావాలంటే సాంకేతిక ప్రమాణాలు, పాలనా వ్యవస్థలు,వాణిజ్య అసమతుల్యతల నిర్వహణ వంటి అంశాలపై సభ్య దేశాల మధ్య విస్తృత స్థాయి ఏకాభిప్రాయం అవసరమని నిపుణులు చెబుతున్నారు.

వివరాలు 

భారత్-రష్యా మధ్య స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు

అలాగే ఇతర దేశాలు అభివృద్ధి చేసిన సాంకేతిక వేదికలను స్వీకరించడంపై కొంత అనాసక్తి ఉండటం వల్ల ఈ ప్రక్రియ నెమ్మదించే అవకాశం ఉందని కొన్ని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గతంలో భారత్-రష్యా మధ్య స్థానిక కరెన్సీలతో వాణిజ్య లావాదేవీలు నిర్వహించే ప్రయత్నాలు కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. ఈ అనుభవాలన్నింటిని పరిగణనలోకి తీసుకుంటే, BRICS డిజిటల్ కరెన్సీ అనుసంధానం ఒక దీర్ఘకాల ప్రయాణమే అయినప్పటికీ, భవిష్యత్తులో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక మలుపుగా మారే అవకాశముందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

Advertisement