India's fertiliser: ఇన్‌పుట్ కొరతల దెబ్బ.. 5 ఏళ్ల కనిష్టానికి ఎరువుల ఉత్పత్తి
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో ఎరువుల ఉత్పత్తి తీవ్రంగా పడిపోయింది. మార్చి నెలలో ఉత్పత్తి ఏడాది కిందటితో పోలిస్తే 24.6 శాతం తగ్గి, ఐదేళ్ల కనిష్టానికి చేరింది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల కారణంగా ఇన్‌పుట్ సరఫరాల్లో అంతరాయం రావడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం,కోర్ సెక్టార్ సూచీలో ఎరువులను మినహాయిస్తే, సూచీ పడిపోకుండా స్థిరంగానే ఉండేదని గణాంకాలు చెబుతున్నాయి. మార్చి 2026లో ఎరువుల ఉత్పత్తి సూచీ 95.7కి పడిపోయి,2021 ఏప్రిల్ తర్వాత కనిష్ట స్థాయిని నమోదు చేసింది. ఎనిమిది కీలక రంగాలను ట్రాక్ చేసే కోర్ సెక్టార్ సూచీ ఏడాదికి 0.4 శాతం క్షీణించింది. ఇందులో ఎరువులు,క్రూడ్ ఆయిల్,బొగ్గు, విద్యుత్ రంగాలు ప్రధానంగా తగ్గుదలకు కారణమయ్యాయి.
వివరాలు
ఎరువుల ఫ్యాక్టరీలకు సహజ వాయువు సరఫరా 95% కి పెంపు
కొత్త పంటల సీజన్‌కు అంతరాయం లేకుండా ఉండాలంటే సరఫరా సమస్యలు తగ్గడం లేదా దిగుమతులు పెరగడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఎకనామిక్ సర్వే ప్రకారం భారత్ మొత్తం ఎరువుల వినియోగంలో దాదాపు 27 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. ఇదిలా ఉండగా ఎరువుల ఫ్యాక్టరీలకు సహజ వాయువు సరఫరాను 90 శాతం నుంచి 95 శాతానికి పెంచారు. అంతకుముందు 70% నుంచి 90%కి పెంచగా... ఇప్పుడు మరోసారి 95%కి పెంచారు.
వివరాలు
అంతంతమాత్రంగానే ఇతర రంగాల పరిస్థితి
వంట గ్యాస్, వాహనాల కోసం PNG, CNG సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు కొంతకాలం గ్యాస్ సరఫరాను తగ్గించడంతో ఉత్పత్తిపై ప్రభావం పడింది. ఇక ఇతర రంగాల పరిస్థితి కూడా అంతంతమాత్రంగానే ఉంది. బొగ్గు ఉత్పత్తి 4 శాతం తగ్గగా, క్రూడ్ ఆయిల్ 5.7 శాతం పడిపోయింది. విద్యుత్ ఉత్పత్తి కూడా 0.5 శాతం తగ్గింది. అయితే ఉక్కు, సిమెంట్ రంగాలు పెరుగుదల చూపించినప్పటికీ ఫిబ్రవరిలో ఉన్నంత వేగంగా మాత్రం పెరగలేదు.