Page Loader
Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా? 
28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా?

Gaming Industry: 28శాతం జీఎస్టీ నిర్ణయం, భారత ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందా? 

వ్రాసిన వారు Stalin
Jul 12, 2023
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆన్‌లైన్, క్యాసినో, గుర్రపు పందాలపై 28శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయం భారత గేమింగ్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశీయ ఆన్‌లైన్ గేమింగ్‌ పరిశ్రమ నాశనాన్ని శాసిస్తుందని నిపుణులు అంటున్నారు. వాస్తవానికి భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఇంటర్నెట్ వ్యాపారాల్లో ఆన్‌లైన్ గేమింగ్ ఒకటి. ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ గత కొన్ని సంవత్సరాలుగా స్థిరమైన వృద్ధిని సాధిస్తోంది. తాజా నిర్ణయం గేమింగ్ పరిశ్రమ వృద్ధిని అడ్డుకోనుంది. గత ఐదు సంవత్సరాల్లో భారతీయ గేమింగ్ పరిశ్రమ దేశీయ, ప్రపంచ పెట్టుబడిదారుల నుంచి 2.8 బిలియన్ డాలర్లను సేకరించింది.

ఆన్‌లైన్

ఆన్‌లైన్ గేమింగ్‌పై వినియోగదారులకు తగ్గనున్న ఆసక్తి

ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా వచ్చే ఆదాయం 2022లో 35శాతం పెరిగింది. 2025నాటికి భారత ఆన్‌లైన్ గేమింగ్ వార్షిక ఆదాయం 2బిలియన్ డాలర్ల మార్కును దాటుతుందని నిపుణులు అంచనా వేశారు. అయితే 28శాతం జీఎస్టీ అమలతో ఆ అంచనాలు తలకిందులయ్యాయి. వినియోగదారులు భారీగా పన్ను చెల్లించాల్సి రావడంతో వారికి ఆన్‌లైన్ గేమింగ్‌పై ఆసక్తి తగ్గే అవకాశం ఉంది. అలాగే పన్ను చెల్లించాల్సిన అవసరం లేని, చట్టవిరుద్ధ ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లను వినియోగదారులు ఆశ్రయించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆన్‌లైన్ గేమ్ గెలిచిన ప్లేయర్ జీఎస్టీతో పాటు అదనంగా టీడీఎస్ కూడా చెల్లించాల్సి వస్తోంది. దీంతో జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న తాజా నిర్ణయం భారతదేశంలో ఆన్‌లైన్ గేమింగ్‌ను అర్ధంలేనిదిగా చేసినట్లు వాదనలు వినిపిస్తున్నాయి.

ఆన్‌లైన్

భారతదేశ ప్రయోజనాలకు విఘాతం 

జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం భారతదేశ ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుందని ఆన్‌లైన్ గేమింగ్ పరిశ్రమ అభిప్రాయపడింది. ఇది అనేక విజయవంతమైన భారతీయ స్టార్టప్‌లను తీవ్రంగా దెబ్బకొడుతుందని, అలాగే ఇతర దేశాల కంపెనీలకు కూడా ప్రయోజనం చేకూరుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్ గేమింగ్ అనేది సరిహద్దులు లేని పరిశ్రమ అనే విషయం అందరికి తెలిసిందే. భారతదేశంలో అదనపు పన్ను భారం ఇతర దేశాల నుంచి పనిచేసే గేమింగ్ కంపెనీలు పెరగడానికి ఉపకరిస్తుంది. ఇదే కనుక జరిగితే, దేశీయ గేమింగ్ పరిశ్రమను భారత ప్రభుత్వమే చేజేతులా సర్వ నాశనం చేసినట్లు అవుతుందనే అభిప్రయాం వ్యక్తమవుతోంది. తద్వారా కొత్త గేమ్‌లను అభివృద్ధి చేయడానికి గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహాన్ని కూడా కోల్పోనున్నాయి.