LOADING...
IIP growth: అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 
అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి

IIP growth: అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 02, 2025
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ పారిశ్రామికోత్పత్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధాన రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది. అక్టోబర్ నెలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వ తాజా అధికారిక గణాంకాల ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) కేవలం 0.4 శాతం వృద్ధికే పరిమితమై, ఏడాదికిపైగా కనిష్ఠ స్థాయికి చేరింది. విద్యుత్తు, గనులు, తయారీ రంగాల బలహీన ప్రదర్శన కారణంగా ఇది గత ఏడాది సెప్టెంబర్‌ స్థాయికి చేరిపోయింది. అప్పట్లో వృద్ధిరేటు శూన్యానికి పడిపోగా, మళ్లీ అంతే స్థాయిలో తాజా గణాంకాలు నమోదవడం గమనార్హం. ఇక గతేడాది అక్టోబర్‌లో ఐఐపీ వృద్ధి 3.7 శాతంగా ఉండిందని జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్‌ఎస్‌వో) వెల్లడించగా, ఈ ఏడాది సెప్టెంబర్‌లో 4.6 శాతంగా నమోదైనట్టు పేర్కొంది.

వివరాలు 

అక్టోబర్‌లో 0.9 శాతం పాజిటివ్‌ వృద్ధి

రంగాల వారీగా చూడగానే పరిస్థితి మరింత స్పష్టమవుతోంది. తయారీ రంగ వృద్ధిరేటు ఈ అక్టోబర్‌లో కేవలం 1.8 శాతానికి తగ్గింది. నిరుడు ఇదే నెలలో ఇది 4.4 శాతంగా ఉండటం గమనార్హం. గనుల రంగంలో వృద్ధి మైనస్‌ 1.8 శాతానికి పడిపోయింది. గత ఏడాది అక్టోబర్‌లో మాత్రం 0.9 శాతం పాజిటివ్‌ వృద్ధి నమోదైంది. విద్యుత్తు ఉత్పత్తి రంగంలో పరిస్థితి మరింత దయనీయంగా మారి, వృద్ధి మైనస్‌ 6.9 శాతానికి చేరింది. గతేడాది ఇదే సమయంలో 2 శాతం వృద్ధి ఉండటం విశేషం. ఈ ప్రతికూల ప్రదర్శనల మధ్య మొత్తం ఐఐపీ వృద్ధిరేటు అక్టోబర్‌లో తీవ్ర నిరాశనే మిగిల్చింది.

వివరాలు 

 మైనస్‌ 4.4శాతానికి కన్జ్యూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌ ఉత్పత్తి

ఇదే సమయంలో క్యాపిటల్‌ గూడ్స్‌ రంగంలో వృద్ధిరేటు 2.9 శాతం నుంచి 2.4శాతానికి దిగజారింది. వినియోగదారుల దీర్ఘకాలిక వస్తువుల (కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌) ఉత్పత్తి వృద్ధి మైనస్‌ 0.5శాతానికి చేరగా,గతేడాది అక్టోబర్‌లో ఈ రంగం 5.5 శాతం వృద్ధిని సాధించడం గమనార్హం. అలాగే కన్జ్యూమర్‌ నాన్‌-డ్యూరబుల్స్‌ ఉత్పత్తి కూడా బాగా క్షీణించి మైనస్‌ 4.4శాతానికి పడిపోయింది. పూర్వంలో ఈ విభాగంలో 2.8 శాతం వృద్ధి ఉండేది.ప్రైమరీ గూడ్స్‌ విభాగంలో ఉత్పాదకత సైతం గతంలో నమోదైన 2.5 శాతం వృద్ధి నుంచి నేరుగా మైనస్‌ 0.6 శాతానికి దిగజారింది. ఈ పరిస్థితుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మరియు కన్‌స్ట్రక్షన్‌ గూడ్స్‌ రంగంలో వృద్ధిరేటు ఈసారి 7.1 శాతానికి చేరినా, మొత్తం ఐఐపీ పనితీరుపై అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

Advertisement

వివరాలు 

ఇంటర్మీడియెట్‌ గూడ్స్‌ విభాగంలో ఈసారి వృద్ధి 0.9 శాతం

నిరుడు అక్టోబర్‌లో ఇదే రంగం 4.7 శాతంగా ఉండగా, ఇంటర్మీడియెట్‌ గూడ్స్‌ విభాగంలో ఈసారి వృద్ధి 0.9 శాతంగా మాత్రమే నమోదైంది. గతేడాది అక్టోబర్‌లో ఇది 4.8 శాతంగా నమోదైనట్టుగా ఎన్‌ఎస్‌వో వెల్లడించింది. ఇక ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో తొలి ఏడు నెలల కాలంలో (ఏప్రిల్‌ నుంచి అక్టోబర్‌ వరకు) దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధిరేటు 2.7 శాతానికి పరిమితమైనట్టు ఎన్‌ఎస్‌వో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25) ఇదే కాలంలో ఈ వృద్ధి 4 శాతంగా ఉండటం గమనార్హం. తయారీ రంగంలో మొత్తం 23 ఇండస్ట్రీ గ్రూపులు ఉండగా,వీటిలో కేవలం 9 మాత్రమే ఈ ఏడాది అక్టోబర్‌లో గతేడాదితో పోల్చితే వృద్ధిని నమోదు చేశాయి.

Advertisement

వివరాలు 

నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం

మిగిలిన 14 రంగాలు ఉత్పత్తి పరంగా నెమ్మదినే కొనసాగించాయని నివేదిక స్పష్టం చేస్తోంది. పారిశ్రామిక రంగంలోని ఈ క్షీణత దేశ ఆర్థిక పురోగతిపై పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉత్పత్తి తగ్గడం దేశంలో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యం బలహీనపడుతున్నట్టు, మార్కెట్‌లో డిమాండ్‌ పడిపోయిందన్న విషయాన్ని ప్రతిబింబిస్తోందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే నిరుద్యోగ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు చేస్తున్నారు. పరిశ్రమ రంగంలో పెట్టుబడులు తగ్గడం, రుణ లభ్యతలో ఇబ్బందులు తలెత్తడం, ప్రభుత్వ ప్రోత్సాహకాలు తగిన స్థాయిలో అందకపోవడం కూడా ఈ మందగమనానికి కారణాలుగా పేర్కొంటున్నారు. తాజా ఐఐపీ గణాంకాలే ఈ వాస్తవ పరిస్థితికి నిదర్శనమని ఆర్థిక వర్గాలు చెబుతున్నాయి.

వివరాలు 

ఆర్థిక శాఖ మంత్రికి వ్యాపార, పారిశ్రామిక సంఘాలు లేఖ

ఈ నేపథ్యంలో రాబోయే ఆర్థిక సంవత్సరం 2026-27 కోసం కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో పరిశ్రమలకు పన్ను రాయితీలు, అదనపు ప్రోత్సాహక చర్యలు ప్రకటించాలని పరిశ్రమ పెద్దలు, వివిధ రంగాల సంఘాలు కోరుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు వ్యాపార, పారిశ్రామిక సంఘాలు లేఖల ద్వారా తమ డిమాండ్లను ఇప్పటికే తెలియజేశాయని సమాచారం. మొత్తం మీద దేశీయ పారిశ్రామిక రంగంలో నెలకొన్న నీరసం ఎంత తీవ్రంగా ఉందో తాజా ఐఐపీ గణాంకాలు స్పష్టంగా చూపిస్తున్నాయనే చెప్పవచ్చు.

Advertisement