India's Manufacturing Sector: పుంజుకున్న భారత తయారీ రంగం.. రికార్డు స్థాయిలో పెరిగిన ఇన్‌పుట్ ఖర్చులు
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ తయారీ రంగం ఏప్రిల్‌లో మళ్లీ పుంజుకుంది. మార్చిలో నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయిన తర్వాత ఈ రికవరీ కనిపించింది. ఎగుమతి ఆర్డర్లు గణనీయంగా పెరగడం ఈ పెరుగుదలకు ప్రధాన కారణమని S&P గ్లోబల్ డేటా వెల్లడించింది. హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) మార్చిలో 53.9గా ఉండగా, ఏప్రిల్‌లో 54.7కి పెరిగింది. 50 మార్క్‌కి పైగా ఉండటం వల్ల తయారీ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
వివరాలు
ఈ అంశాలు ప్రభావం చూపుతున్నాయన్న సర్వే
అయితే ఇది గత ఫ్లాష్ PMI 55.9 కంటే తక్కువగానే ఉంది. అయినప్పటికీ వరుసగా 54 నెలలుగా రంగం విస్తరణలోనే కొనసాగుతోంది. మరోవైపు, వెస్ట్ ఏషియా యుద్ధ ప్రభావం, పోటీ పరిస్థితులు, కస్టమర్ల కోట్స్ ఆమోదంలో ఆలస్యం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయని సర్వే తెలిపింది. ముఖ్యంగా ఇన్‌పుట్ ఖర్చులు నాలుగేళ్లలోనే అత్యంత వేగంగా పెరగగా, అల్యూమినియం, కెమికల్స్, ఇంధనం, రబ్బరు వంటి ముడి సరుకుల ధరల పెరుగుదల దీనికి కారణమని హెచ్‌ఎస్‌బీసీ చీఫ్ ఎకనమిస్ట్ ప్రజుల్ భండారి తెలిపారు. ఖర్చులు పెరిగినా, ఎగుమతి ఆర్డర్లు ఏడు నెలల గరిష్టానికి చేరగా, కంపెనీలు ఉద్యోగులను ఎక్కువగా నియమించుకోవడం కూడా గమనార్హం.