Loading...
Nirmala Sitharaman: పేదరికం నుంచి బయటపడ్డవారు మళ్లీ ఆ ఊబిలో పడకుండా చూడటమే తదుపరి సవాలు: నిర్మలా సీతారామన్
పేదరికం నుంచి బయటపడ్డవారు మళ్లీ ఆ ఊబిలో పడకుండా చూడటమే తదుపరి సవాలు: నిర్మలా సీతారామన్

Nirmala Sitharaman: పేదరికం నుంచి బయటపడ్డవారు మళ్లీ ఆ ఊబిలో పడకుండా చూడటమే తదుపరి సవాలు: నిర్మలా సీతారామన్

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 23, 2026
02:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో పేదరిక నిర్మూలన దిశగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే పేదరికం నుంచి బయటపడిన ప్రజలు తిరిగి అదే పరిస్థితుల్లోకి వెళ్లకుండా చూడటమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన సవాలని పేర్కొన్నారు. సామాన్యులకు ఆర్థిక సేవలు, స్టాక్ మార్కెట్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు ప్రజలకు స్థిరమైన ఆదాయ మార్గాలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలను కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు లింక్డ్‌ఇన్ వేదికగా 'ది డెకేడ్ ఇండియా టర్న్‌డ్ ది టైడ్ ఆఫ్ పావర్టీ' పేరుతో రాసిన వ్యాసంలో తన అభిప్రాయాలను వెల్లడించారు.

వివరాలు 

12 ఏళ్లలో 50 కోట్ల మందికి పేదరికం నుంచి విముక్తి

భారత్‌లో పేదరిక నిర్మూలనకు సంబంధించి ప్రపంచ బ్యాంకు (వరల్డ్ బ్యాంక్) విడుదల చేసిన నివేదికను నిర్మలా సీతారామన్ తన వ్యాసంలో ప్రస్తావించారు.

2011 నుంచి 2023 మధ్యకాలంలో దేశంలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రపంచ బ్యాంకు వెల్లడించినట్లు తెలిపారు.

అత్యంత పేదరికాన్ని కూడా భారత్ గణనీయంగా తగ్గించగలిగిందని పేర్కొన్నారు.

ఈ పురోగతి ఇచ్చిన స్ఫూర్తితో సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరచాలని అన్నారు.

ఇప్పటికే పేదరికాన్ని అధిగమించిన కుటుంబాలు మళ్లీ ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకోకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

వివరాలు 

పేదరికం అంటే తక్కువ ఆదాయం మాత్రమే కాదు

పేదరికాన్ని కేవలం ఆదాయంతో మాత్రమే ముడిపెట్టి చూడకూడదని ఆర్థిక మంత్రి అభిప్రాయపడ్డారు.

ఒక కుటుంబానికి సరైన ఇల్లు, సురక్షితమైన తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, మెరుగైన వైద్యం అందుబాటులో లేకపోతే.. ఆదాయం పెరిగినా ఆ కుటుంబం ఆర్థికంగా, సామాజికంగా బలహీనంగానే ఉంటుందని వివరించారు.

ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేలా కేంద్ర ప్రభుత్వం సమగ్ర విధానంతో ముందుకు వెళ్తోందని తెలిపారు.

ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ మిషన్, జల్ జీవన్ మిషన్, ఉజ్వల యోజన పథకాల ద్వారా సాధించిన పురోగతిని ప్రస్తావించారు.

అలాగే ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణం, ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆరోగ్య సేవలు అందించేందుకు చేపట్టిన చర్యలను వివరించారు.

ADVERTISEMENT

వివరాలు 

పథకాల అమలులో సాంకేతికతకు ప్రాధాన్యం

ప్రభుత్వ పథకాల అమలులో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా మార్గనిర్దేశం చేశారని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

వివిధ సమస్యల పరిష్కారానికి అవసరమైన సందర్భాల్లో ఆయన నేరుగా చొరవ తీసుకున్నారని తెలిపారు.

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు అందుతున్నాయా? లేదా? అనే విషయాన్ని తెలుసుకునేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని ప్రధాని సూచించినట్లు వెల్లడించారు.

ఆర్థిక సేవలు, మౌలిక సదుపాయాలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం వల్ల సంక్షేమ పథకాల అమలు మరింత మెరుగుపడిందని మంత్రి వివరించారు.

దీంతో ప్రజలకు ఆదాయం సంపాదించేందుకు కొత్త మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పారు.

ఈ క్రమంలో జన్‌ధన్ బ్యాంకు ఖాతాల పథకం సాధించిన విజయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు.

ADVERTISEMENT

వివరాలు 

మహిళా సంఘాలతో ఆర్థిక అవకాశాలు

ప్రజలకు ఆర్థిక అవకాశాలు విస్తరించడంలో మహిళల స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు.

మహిళలకు ఆర్థికంగా ఎదిగేందుకు, ఆదాయాన్ని పెంచుకునేందుకు ఈ సంఘాలు అవకాశాలు కల్పిస్తున్నాయని పేర్కొన్నారు.

పేదరిక నిర్మూలన లక్ష్యం కేవలం ప్రజలకు తాత్కాలిక ఆర్థిక సాయం అందించడంతోనే పూర్తికాదని మంత్రి అభిప్రాయపడ్డారు.

ప్రతి ఒక్కరికీ ఆర్థికంగా ఎదిగే అవకాశాలు అందుబాటులో ఉండాలని, పేదరికం నుంచి బయటపడిన వారు తిరిగి ఆ పరిస్థితుల్లోకి వెళ్లకుండా స్థిరమైన జీవనోపాధి మార్గాలను కల్పించాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు.

ADVERTISEMENT