LOADING...
Unemployment rate: నవంబర్‌లో 4.7 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు 
నవంబర్‌లో 4.7 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు

Unemployment rate: నవంబర్‌లో 4.7 శాతానికి తగ్గిన నిరుద్యోగ రేటు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 15, 2025
05:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

నవంబర్ నెలలో దేశంలో నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గింది. అధికారిక గణాంకాల ప్రకారం, అక్టోబర్‌లో 5.2 శాతంగా ఉన్న నిరుద్యోగ రేటు నవంబర్‌లో 4.7 శాతానికి పడిపోయింది. ఇది గత ఎనిమిది నెలల్లో కనిష్ట స్థాయి కావడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగ అవకాశాలు మెరుగుపడటం, మహిళల పని భాగస్వామ్యం పెరగడం వల్లే ఈ తగ్గుదల చోటుచేసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. గ్రామీణ నిరుద్యోగ రేటు 3.9 శాతానికి తగ్గింది. ఇది ఏప్రిల్ తర్వాత అతి తక్కువ స్థాయి. పట్టణ ప్రాంతాల్లోనూ నిరుద్యోగ రేటు తగ్గి 6.5 శాతానికి చేరుకుంది. ఇది ఈ ఏడాది మొదట్లో నమోదైన కనిష్ట స్థాయికి సమానం.

వివరాలు 

నవంబర్‌లో మహిళల పని భాగస్వామ్యం 35.1 శాతం 

ఇదే సమయంలో కార్మిక శక్తి భాగస్వామ్య రేటు(LFPR)కూడా పెరిగింది. 15 సంవత్సరాలు పైబడిన వారిలో LFPR నవంబర్‌లో 55.8 శాతానికి చేరి, ఏప్రిల్ తర్వాత గరిష్ట స్థాయిని నమోదు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పని చేసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుండగా,పట్టణాల్లో మాత్రం LFPR 50.4 శాతానికి తగ్గి ఐదు నెలల కనిష్టానికి చేరింది. ఉద్యోగ మార్కెట్‌లో ఈ మెరుగుదలకు ప్రధాన కారణం మహిళల భాగస్వామ్యమేనని గణాంకాలు సూచిస్తున్నాయి. నవంబర్‌లో మహిళల పని భాగస్వామ్యం 35.1 శాతానికి పెరిగింది. జూన్ నుంచి కొనసాగుతున్న పెరుగుదల ఇది. ఈ వృద్ధి ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించగా, పట్టణ ప్రాంతాల్లో మహిళల భాగస్వామ్యం దాదాపు స్థిరంగానే ఉంది.

వివరాలు 

అక్టోబర్‌లో 14.9 శాతంగా ఉన్న యువ నిరుద్యోగ రేటు నవంబర్‌లో 14.1 శాతానికి తగ్గింది

పురుషుల నిరుద్యోగ రేటు 4.6 శాతం కాగా, మహిళలది 4.8 శాతంగా ఉంది. దీంతో పురుష-మహిళల మధ్య నిరుద్యోగ వ్యత్యాసం కేవలం 0.2 శాతానికి తగ్గింది. యువతలోనూ నిరుద్యోగం కొంత తగ్గింది. అక్టోబర్‌లో 14.9 శాతంగా ఉన్న యువ నిరుద్యోగ రేటు నవంబర్‌లో 14.1 శాతానికి తగ్గింది. ఇది ఉద్యోగ అవకాశాలు క్రమంగా మెరుగుపడుతున్నాయనే మరో సంకేతంగా భావిస్తున్నారు. ఆర్థిక వ్యవస్థకు కీలక సమయంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మూడో త్రైమాసికంలో వృద్ధి మందగించే అవకాశం ఉందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటికే హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ మార్కెట్ బలపడటం వల్ల సమీప కాలంలో ఆర్థిక మందగమన ప్రభావం కొంతవరకు తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement