Loading...
UPI-Bizum: భారత్-స్పెయిన్ మధ్య యూపీఐ-బిజుమ్ లింక్‌కు ముందడుగు
భారత్-స్పెయిన్ మధ్య యూపీఐ-బిజుమ్ లింక్‌కు ముందడుగు

UPI-Bizum: భారత్-స్పెయిన్ మధ్య యూపీఐ-బిజుమ్ లింక్‌కు ముందడుగు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 20, 2026
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్, స్పెయిన్ దేశాలు తమ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ), బిజుమ్ (Bizum)లను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించాయి. దీంతో రెండు దేశాల మధ్య జరిగే సరిహద్దులు దాటే నగదు బదిలీలు దేశీయ లావాదేవీల మాదిరిగానే సులభంగా జరిగే అవకాశం ఉంది. ఈ విషయాన్ని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. ఇటీవల కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ స్పెయిన్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై చర్చలు ప్రారంభమయ్యాయి. యూపీఐ-బిజుమ్ అనుసంధానం ద్వారా భారత్, స్పెయిన్ మధ్య డిజిటల్ చెల్లింపులు మరింత వేగంగా, సులభంగా మారనున్నాయి. దీనివల్ల ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలు మరింత బలపడతాయని రెండు దేశాలు భావిస్తున్నాయి.

వివరాలు 

రెండు దేశాల వ్యాపార సంస్థలకు కొత్త అవకాశాలు

ఇదే సమయంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడం, నిపుణుల రాకపోకలను సులభతరం చేయడం వంటి అంశాలపైనా ఇరు దేశాలు చర్చించాయి.

యూరప్, లాటిన్ అమెరికాకు ప్రవేశ ద్వారంగా ఉన్న స్పెయిన్ వ్యూహాత్మక స్థానాన్ని ఉపయోగించుకొని లాటిన్ అమెరికాలో సంయుక్త పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కూడా అంగీకరించాయి.

దీంతో రెండు దేశాల వ్యాపార సంస్థలకు కొత్త అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది.

వాహనాలు, ఔషధాలు, రసాయనాలు, వస్త్ర పరిశ్రమ, పునరుత్పాదక ఇంధనం, పర్యాటకం, మౌలిక వసతుల వంటి కీలక రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించాలని భారత్, స్పెయిన్ నిర్ణయించాయి.

ఈ రంగాల్లో భాగస్వామ్యం పెరగడం ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యం మరింత విస్తరించే అవకాశాలు ఉన్నాయని అధికారులు పేర్కొన్నారు.

వివరాలు 

యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చలు 

బ్రస్సెల్స్ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ యూరోపియన్ యూనియన్‌తో వాణిజ్య చర్చలపైనా దృష్టి సారించారు.

భారత నౌకల రీసైక్లింగ్ యార్డులకు గుర్తింపు కల్పించాలని కోరడంతో పాటు, నైపుణ్యాభివృద్ధి, విద్య, ప్రతిభావంతుల రాకపోకలపై భారత్-యూరోపియన్ యూనియన్ మధ్య ప్రత్యేక సంభాషణ ప్రారంభించాలని ప్రతిపాదించారు.

అలాగే పెట్టుబడుల రక్షణ ఒప్పందం, భౌగోళిక గుర్తింపుల (Geographical Indications) ఒప్పందం, కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (CBAM)పై కూడా చర్చలు కొనసాగాయి.

ADVERTISEMENT