LOADING...
BIS guidelines: భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు కొత్త భద్రతా నిబంధనలు
భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు కొత్త భద్రతా నిబంధనలు

BIS guidelines: భారత్‌లో డిజిటల్ చెల్లింపులకు కొత్త భద్రతా నిబంధనలు

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 13, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు Bureau of Indian Standards (బీఐఎస్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. బయోమెట్రిక్ ధృవీకరణ, క్యూ ఆర్ కోడ్ చెల్లింపులు, డిజిటల్ కరెన్సీ భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన ఈ నిబంధనలు మోసాల ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు వ్యవస్థల మధ్య అనుసంధానాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా ఉన్నాయి. భారత్‌లో వేగంగా పెరుగుతున్న డిజిటల్ ఫైనాన్స్ వ్యవస్థను దృష్టిలో ఉంచుకుని, విదేశీ దేశాల్లోనూ నమ్మకాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. దేశంలో బయోమెట్రిక్, క్యూ ఆర్ కోడ్ ఆధారిత చెల్లింపులు విస్తృతంగా వినియోగంలోకి రావడంతో మోసాలు, వ్యక్తిగత వివరాల దుర్వినియోగం వంటి ఆందోళనలు పెరిగాయి.

వివరాలు 

త్వరలో జపాన్‌లో భారత్ క్యూ ఆర్ కోడ్ చెల్లింపు విధానం

2026 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఫిబ్రవరి వరకు 218 బిలియన్‌కు పైగా ట్రాన్సాక్షన్లు నమోదవడంతో బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, చెల్లింపు సేవలందరికి ఒక క్రమబద్ధమైన భద్రతా విధానం అవసరమని నియంత్రణ సంస్థలు భావించాయి. భారత్ క్యూ ఆర్ కోడ్ చెల్లింపు విధానం ఇప్పటికే సింగపూర్, యూఏఈ, ఫ్రాన్స్, నేపాల్, భూటాన్, శ్రీలంక, మారిషస్ దేశాల్లో అమలులో ఉంది. త్వరలో జపాన్‌లో కూడా ప్రారంభం కానుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం,అదే కాలంలో మొత్తం రూ.284.7 లక్షల కోట్లు విలువైన డిజిటల్ లావాదేవీలు జరిగాయి. కొత్త నిబంధనల ప్రకారం,బయోమెట్రిక్ ఆధారిత సేవల కోసం కఠిన భద్రతా ప్రమాణాలు అమలు చేయాలని బీఐఎస్ స్పష్టం చేసింది.

వివరాలు 

డిజిటల్ కరెన్సీ భద్రతపైనా బీఐఎస్ ప్రత్యేక ప్రమాణాలు

బయోమెట్రిక్ డేటా రక్షణ, నకిలీ గుర్తింపులను అడ్డుకునే చర్యలు, సురక్షిత నిల్వ, డేటా ప్రసారం వంటి అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించింది. ఇక క్యూ ఆర్ కోడ్ చెల్లింపుల విషయంలో నకిలీ కోడ్లు, దారి మళ్లింపు చెల్లింపులు, అనధికార లావాదేవీలను నివారించేందుకు ప్రత్యేక భద్రతా విధానాలను సూచించింది. చిన్న వ్యాపారులు, రిటైల్ రంగంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న ఈ విధానానికి ఇది కీలకమని పేర్కొంది. డిజిటల్ కరెన్సీ భద్రతపైనా బీఐఎస్ ప్రత్యేక ప్రమాణాలు తీసుకువచ్చింది. క్రిప్టోగ్రఫీ రక్షణ, లావాదేవీల ధృవీకరణ, సైబర్ ముప్పులకు ఎదుర్కొనే సామర్థ్యం వంటి అంశాలను ఇందులో చేర్చింది. భారత్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న డిజిటల్ కరెన్సీ ప్రాజెక్ట్‌లో ఇప్పటివరకు 120 మిలియన్‌కు పైగా లావాదేవీలు నమోదయ్యాయి.

Advertisement