Page Loader
US Trade Deal: ఒత్తిడిలో భారత్‌ వెనకడుగు వేయదు: సీఐఐ అధ్యక్షుడు
ఒత్తిడిలో భారత్‌ వెనకడుగు వేయదు: సీఐఐ అధ్యక్షుడు

US Trade Deal: ఒత్తిడిలో భారత్‌ వెనకడుగు వేయదు: సీఐఐ అధ్యక్షుడు

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 06, 2025
01:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్-అమెరికా మధ్య తాత్కాలిక ట్రేడ్ డీల్‌పై చర్చలు ముమ్మరంగా సాగుతున్న వేళ, భారత పారిశ్రామిక వర్గాల కీలక ప్రతినిధి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) జాతీయ అధ్యక్షుడు రాజీవ్ మెమాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ఎలాంటి ఒత్తిడికీ లోనయ్యే ప్రసక్తే లేదు. జాతి ప్రయోజనాలే ప్రభుత్వానికి ప్రాధాన్యం. దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే నిర్ణయాలు తీసుకుంటారని స్పష్టం చేశారు.

Details

మధ్యంతర ఒప్పందంపై అంచనాలు

భారత పారిశ్రామిక వర్గాలు అమెరికాతో ఒక వాణిజ్య ఒప్పందం కుదరాలని కోరుకుంటున్నప్పటికీ, అది దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని మెమాని అన్నారు. మా అంచనాల ప్రకారం తాత్కాలిక ట్రేడ్ డీల్ జరగొచ్చు.కార్మిక ఆధారిత రంగమైన వస్త్ర పరిశ్రమకు ఇది ఎంతో మేలు చేస్తుంది. అదే విధంగా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు, ఆటో విడిభాగాలు, రసాయన రంగం కూడా ఈ ఒప్పందం ద్వారా లాభపడే అవకాశముంది. అమెరికాలో ట్రంప్ సర్కార్ విధించిన ప్రతీకారపు టారిఫ్‌లపై విధించిన 90 రోజుల గడువు ఈ నెల 9తో ముగియనుంది. ట్రంప్‌ ప్రభుత్వం భారత పట్ల విధించిన 26 శాతం టారిఫ్‌లు ఇప్పటికీ అమల్లో ఉన్న నేపథ్యంలో, గడువు ముగిసేలోగా ఒక మధ్యంతర ఒప్పందం వెలువడే అవకాశముందన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి.

Details

రాజకీయ విమర్శల మధ్య మెమాని స్పందన ప్రాధాన్యం

ఈ క్రమంలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భారత్‌ అమెరికా ఒత్తిడికి తలొగ్గుతుందని ఇటీవల వ్యాఖ్యానించగా, రాజీవ్ మెమాని చేసిన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వ వైఖరికి బలాన్ని చేకూర్చినట్లయ్యాయి. మరోవైపు, ఇటీవల అమెరికా అధ్యక్షుడు భారత్‌తో ఒక పెద్ద ట్రేడ్ డీల్ కుదరనుందని వ్యాఖ్యానించడమే కాకుండా, దీనికి సంబంధించి కీలక ప్రకటనలు వెలువడే అవకాశముంది. ఈ నేపథ్యంలో మెమాని చేసిన వ్యాఖ్యలు, ట్రేడ్ డీల్ చర్చలపై పారిశ్రామిక వర్గాల దృష్టికోణాన్ని వెల్లడించడమే కాక, దేశ సమగ్రతపై ప్రభుత్వం తీసుకుంటున్న పటిష్ఠ వైఖరిని నొక్కి చెబుతున్నాయి.