LOADING...
Oman to Gujarat: ఒమన్‌ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం
భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం

Oman to Gujarat: ఒమన్‌ నుంచి గుజరాత్‌కు సముద్ర గర్భంలో గ్యాస్ పైప్‌లైన్.. భారీ ప్రాజెక్టుకు పునరుద్దరణకు కేంద్రం శ్రీకారం

వ్రాసిన వారు Sirish Praharaju
May 15, 2026
09:39 am

ఈ వార్తాకథనం ఏంటి

హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఇంధన సరఫరాపై ఏర్పడుతున్న అనిశ్చితిని ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒమన్‌ నుంచి నేరుగా గుజరాత్ తీరానికి సముద్ర గర్భం ద్వారా సహజవాయువును తరలించే భారీ ప్రాజెక్టును మళ్లీ ముందుకు తీసుకురావడానికి చర్యలు ప్రారంభించింది. 'మిడిల్ ఈస్ట్-ఇండియా డీప్‌వాటర్ పైప్‌లైన్' పేరుతో ప్రతిపాదితమైన ఈ ప్రాజెక్టుపై పూర్తి స్థాయి సాధ్యాసాధ్యాల నివేదిక తయారు చేయాలని కేంద్ర పెట్రోలియం శాఖ ప్రభుత్వ రంగ సంస్థలకు ఆదేశించినట్లు సమాచారం. ఈ నివేదిక తయారీ బాధ్యతలను గెయిల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ సంస్థలకు అప్పగించినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

వివరాలు 

పునరుద్ధరణకు కారణమిదే..

ప్రపంచవ్యాప్తంగా చమురు,సహజవాయువు రవాణాకు కీలక మార్గంగా ఉన్న హర్మూజ్ జలసంధిలో ఇటీవల నెలకొన్న సంక్షోభం భారత్‌కు పెద్ద హెచ్చరికగా మారింది. భారత్‌కు అవసరమైన వంటగ్యాస్‌లో దాదాపు 90శాతం, ఎల్ఎన్‌జీలో సుమారు 60 శాతం ఈ మార్గం ద్వారానే దిగుమతి అవుతోంది. దీంతో అక్కడి పరిస్థితుల ప్రభావం నేరుగా దేశ ఇంధన భద్రతపై పడుతోంది. తాజా ఉద్రిక్తతల కారణంగా ఆసియా మార్కెట్‌లో సహజవాయువు ధరలు భారీగా పెరగడంతో ప్రత్యామ్నాయ మార్గాలపై కేంద్రం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సముద్ర గర్భంలో పైప్‌లైన్ ఏర్పాటు ద్వారా గల్ఫ్ దేశాల నుంచి నిరంతరాయంగా సహజవాయువును పొందాలన్న ఆలోచనకు మళ్లీ ఊపొచ్చింది.

వివరాలు 

ప్రపంచంలోనే అత్యంత లోతైన ప్రాజెక్టు

భౌగోళిక రాజకీయ సమస్యలు వచ్చినా సరఫరా ఆగిపోకుండా ఉండేందుకు ఇది దీర్ఘకాలిక పరిష్కారంగా ఉపయోగపడుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ ప్రాజెక్టు అమలైతే ప్రపంచంలోనే అత్యంత లోతైన సముద్ర గర్భ పైప్‌లైన్ ప్రాజెక్టులలో ఒకటిగా నిలవనుంది. ఒమన్‌లోని రాస్ అల్ జిఫాన్ ప్రాంతం నుంచి ప్రారంభమై అరేబియా సముద్రం గుండా గుజరాత్‌లోని పోర్‌బందర్ వరకు పైప్‌లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. దీని మొత్తం పొడవు సుమారు రెండు వేల కిలోమీటర్లుగా ఉండనుంది. సముద్ర గర్భంలో గరిష్ఠంగా 3,450 మీటర్ల లోతులో పైపులు వేయాల్సి ఉండటంతో ఇది అత్యంత సాంకేతిక నైపుణ్యం అవసరమైన ప్రాజెక్టుగా భావిస్తున్నారు. రోజుకు 31 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సహజవాయువును రవాణా చేసే సామర్థ్యంతో ఈ పైప్‌లైన్‌ను రూపొందించనున్నారు.

Advertisement

వివరాలు 

రూ. 40,000 కోట్ల అంచనా వ్యయంతో 2000 కిలోమీటర్ల మేర నిర్మాణం

మొత్తం ప్రాజెక్టు వ్యయం సుమారు రూ.40 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అన్ని అనుమతులు లభించిన తర్వాత నిర్మాణ పనులు పూర్తి కావడానికి ఐదు నుంచి ఏడేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఇంతకుముందు అధిక వ్యయం, సాంకేతిక సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. అయితే 'సౌత్ ఆసియా గ్యాస్ ఎంటర్‌ప్రైజ్' సంస్థ ఇప్పటికే ప్రాథమిక అధ్యయనాలు నిర్వహించి, మూడు వేల మీటర్ల లోతులో ప్రయోగాత్మకంగా పైప్‌లైన్ వేసి సముద్ర గర్భ పరిస్థితులను పరిశీలించింది. ప్రస్తుతం సముద్ర గర్భ పైప్‌లైన్ సాంకేతికతలో వచ్చిన పురోగతితో ఈ ప్రాజెక్టు సాధ్యమేనని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

సరఫరా భద్రత

గెయిల్ మాజీ ఛైర్మన్ అశుతోష్ కర్ణాటక్ మాట్లాడుతూ హర్మూజ్ సంక్షోభం భారత్‌ను అప్రమత్తం చేసిందన్నారు. ఎల్ఎన్‌జీతో పోలిస్తే పైప్‌లైన్ ద్వారా సరఫరా చేస్తే ధరల్లో స్థిరత్వం ఉండటంతో పాటు సరఫరా భద్రత కూడా పెరుగుతుందని చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఒమన్‌తో పాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఖతార్ వంటి దేశాల నుంచి భారత్‌కు నిరంతరాయ సహజవాయువు సరఫరా అందే అవకాశం ఉంది. దీని ద్వారా దేశ ఇంధన భద్రత మరింత బలపడుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.

Advertisement