Gold and Silver: ప్రభుత్వ అనుమతుల్లో జాప్యం కారణంగా బంగారం,వెండి దిగుమతులను నిలిపేసిన భారతీయ బ్యాంకులు..
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలో బ్యాంకులు బంగారం,వెండి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి. బులియన్ దిగుమతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడకపోవడంతో టన్నుల కొద్దీ లోహాలు కస్టమ్స్ వద్దే నిలిచిపోయాయి అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ప్రపంచంలో బంగారం వినియోగంలో భారత్ రెండో స్థానంలో ఉండగా, వెండి కొనుగోలులో ముందంజలో ఉంది. దేశీయ అవసరాల కోసం ప్రధానంగా విదేశీ సరఫరాలపై ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ అంతరాయం సరఫరా కొరతకు దారితీయవచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.
వివరాలు
కొత్త ఉత్తర్వుల కోసం ఎదురుచూస్తున్న బ్యాంకులు
ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో బంగారం,వెండి దిగుమతులకు అనుమతి పొందిన బ్యాంకుల జాబితాను వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేస్తుంది. గత సంవత్సరం ఏప్రిల్‌లో చివరిసారిగా ఈ అనుమతులు జారీ అయ్యాయి. మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో వాటి గడువు ముగిసింది.ప్రస్తుతం కొత్త ఉత్తర్వుల కోసం బ్యాంకులు ఎదురుచూస్తున్నాయి. ఈ ఆదేశాలు రాకపోవడంతో సుమారు ఐదు టన్నుల బంగారం,ఎనిమిది టన్నుల వెండి కస్టమ్స్ క్లియరెన్స్ లేకుండా నిలిచిపోయాయి. ఈ అనిశ్చితి కారణంగా విదేశీ సరఫరాదారులకు కొత్త ఆర్డర్లను ఇవ్వడం బ్యాంకులు నిలిపివేశాయని బులియన్ వ్యాపారులు చెబుతున్నారు. పాత సరుకు క్లియరెన్స్ ఇంకా రాకపోయినప్పుడు కొత్త ఆర్డర్లు ఇవ్వడం ప్రయోజనం ఉండదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
చమురు, వాయువు, ఎరువుల దిగుమతుల వ్యయం కూడా పెరిగే సూచనలు
భారత్ నుంచి డిమాండ్ తగ్గితే అంతర్జాతీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు మార్పులకు లోనయ్యే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఇంధన ధరలు పెరిగాయి. చమురు, వాయువు, ఎరువుల దిగుమతుల వ్యయం కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం, వెండి దిగుమతులు తగ్గడం వల్ల దేశ వాణిజ్య లోటు అధికం కాకుండా నియంత్రణలో ఉండవచ్చని భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంలో ఆలస్యం చేస్తుందేమోనని బులియన్ వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఇదే సమయంలో 2025 సంవత్సరంలో బంగారం డిమాండ్ 710.9 మెట్రిక్ టన్నులుగా నమోదై, గత ఐదేళ్లలో ఇది అత్యల్ప స్థాయి అని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ వెల్లడించింది.