LOADING...
Stock Market: ఐటీ షేర్ల అమ్మకాల దెబ్బ.. 800 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్
ఐటీ షేర్ల అమ్మకాల దెబ్బ.. 800 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

Stock Market: ఐటీ షేర్ల అమ్మకాల దెబ్బ.. 800 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 19, 2026
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడంతో పాటు దేశీయంగా ఐటీ రంగ షేర్లలో వెల్లువెత్తిన అమ్మకాలు మదుపర్లను ఆందోళనకు గురిచేశాయి. దీంతో కీలక సూచీలు ప్రారంభం నుంచే ఒత్తిడికి లోనై భారీ నష్టాలను నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్లు కోల్పోగా, నిఫ్టీ కీలకమైన 24 వేల స్థాయికి దిగువకు చేరింది. ఉదయం 9.30 గంటల సమయానికి సెన్సెక్స్‌ 783 పాయింట్లు క్షీణించి 76,627 వద్ద ట్రేడ్‌ అవుతుండగా, నిఫ్టీ 218 పాయింట్లు పతనమై 23,949 వద్ద కొనసాగుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 10 పైసలు బలపడి 94.30 వద్ద ట్రేడవుతోంది.

వివరాలు 

తీవ్ర ఒత్తిడిని ఎదుర్కుంటున్న ఐటీ రంగ షేర్లు

నిఫ్టీ సూచీలో అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, సిప్లా, బజాజ్‌ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్‌, మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, ఐటీ రంగ షేర్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ప్రపంచ దిగ్గజ టెక్నాలజీ సేవల సంస్థ యాక్సెంచర్‌ తన ఆదాయ వృద్ధి అంచనాలను తగ్గించడంతో పాటు రానున్న రోజుల్లో డిమాండ్‌ బలహీనపడే అవకాశం ఉందని పేర్కొనడం ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావం చూపింది. ఈ పరిణామం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీయడంతో దేశీయ ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు చోటుచేసుకున్నాయి.

వివరాలు 

7.3 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతున్న ఇన్ఫోసిస్

దీంతో నిఫ్టీ ఐటీ సూచీ శుక్రవారం 6 శాతానికి పైగా పతనమైంది. ఇన్ఫోసిస్‌ షేర్లు 7.3 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతుండగా, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు దాదాపు 6 శాతం చొప్పున క్షీణించాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ షేర్లు 5.5 శాతం, విప్రో షేర్లు 4 శాతం మేర నష్టపోయాయి. ఇదిలా ఉండగా, అమెరికా మార్కెట్లలో యాక్సెంచర్‌ షేర్లు గురువారం ఏకంగా 17 శాతం కుప్పకూలడం ఐటీ రంగంపై ప్రతికూల ప్రభావాన్ని మరింత పెంచింది.

Advertisement

వివరాలు 

ఆసియా-పసిఫిక్‌ మార్కెట్ 

ఇక ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లలో శుక్రవారం మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. దక్షిణ కొరియా కోస్పి సూచీ 2.8 శాతం, జపాన్‌ నిక్కీ 0.6 శాతం మేర లాభపడగా, ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.74 శాతం నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. మరోవైపు, అమెరికా స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాలతో ముగియడం గమనార్హం. అయితే, ఐటీ రంగంపై నెలకొన్న ఆందోళనల ప్రభావం దేశీయ మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement