Indian Navy: భారత నౌకాదళానికి 8 కొత్త యుద్ధనౌకలు.. రూ.40 వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదం
ఈ వార్తాకథనం ఏంటి
భారత నౌకాదళాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నేవీ కోసం ఎనిమిది నెక్స్ట్ జనరేషన్ స్టెల్త్ యుద్ధనౌకల (NGC) నిర్మాణానికి రూ.40 వేల కోట్లకు పైగా ఖర్చు చేయనుంది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ (CCS) ఈ భారీ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇటీవల కాలంలో రక్షణ రంగంలో అత్యున్నత స్థాయిలో ఆమోదం పొందిన భారీ ప్రాజెక్టుల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌకల నిర్మాణానికి సంబంధించి కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజినీర్స్ (GRSE), గోవా షిప్‌యార్డ్ లిమిటెడ్ (GSL) సంస్థలతో త్వరలోనే అధికారిక ఒప్పందాలు చేసుకోనున్నారు.
వివరాలు
కార్వెట్ యుద్ధనౌకల ప్రత్యేకత ఏమిటి?
సాధారణంగా కార్వెట్ యుద్ధనౌకలు ఫ్రిగేట్లు, డిస్ట్రాయర్లతో పోలిస్తే పరిమాణంలో చిన్నవిగా ఉంటాయి.
అయితే వేగంగా ప్రయాణించడంతోపాటు శక్తివంతమైన ఆయుధాలను మోసుకెళ్లగలవు.
తీర ప్రాంతాల రక్షణ, సముద్రంలో నిఘా, పహారా వంటి విధుల్లో వీటిని ప్రధానంగా ఉపయోగిస్తారు.
పరిమాణం తక్కువగా ఉన్నప్పటికీ ఆధునిక ఆయుధ వ్యవస్థలు, అత్యాధునిక సెన్సార్లను ఏర్పాటు చేసుకునే సామర్థ్యం వీటికి ఉంటుంది.
భారత నౌకాదళం కోసం నిర్మించనున్న కొత్త తరం కార్వెట్లు సుమారు 2,000 టన్నుల బరువు కలిగి ఉంటాయి.
గంటకు 30 నాట్ల వేగంతో ప్రయాణించగలవు. భారత నౌకాదళం సొంతంగా అభివృద్ధి చేసిన అధునాతన స్టెల్త్ డిజైన్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వీటిని రూపొందించనున్నారు.
శత్రు దేశాల రాడార్లకు సులభంగా చిక్కకుండా ఉండేలా ప్రత్యేకంగా నిర్మించనున్నారు.
వివరాలు
కార్వెట్ యుద్ధనౌకల ప్రత్యేకత ఏమిటి?
ఈ యుద్ధనౌకలు సముద్ర భద్రతకు సంబంధించిన పలు కీలక బాధ్యతలను నిర్వహించగలవు.
గగనతలంలో వచ్చే శత్రు దాడులను అడ్డుకోవడం, సముద్ర ఉపరితలంపై ప్రయాణించే శత్రు నౌకలను ఎదుర్కోవడం, నీటి అడుగున సంచరించే జలాంతర్గాములను గుర్తించి వాటిపై చర్యలు తీసుకోవడం వంటి సామర్థ్యాలు వీటికి ఉంటాయి.
అంటే గాలి, నీరు, నీటి అడుగున ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేలా వీటిని తీర్చిదిద్దనున్నారు.
వివరాలు
70 శాతానికి పైగా స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మాణం
ఈ ప్రాజెక్టులో మరో ముఖ్యమైన అంశం స్వదేశీ పరిజ్ఞానానికి ఇస్తున్న ప్రాధాన్యం.
కొత్త యుద్ధనౌకల తయారీలో 70శాతానికి పైగా స్వదేశీ సాంకేతికత,దేశీయంగా తయారైన పరికరాలు, వస్తువులనే వినియోగించనున్నారు.
దీంతో కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమానికి మరింత ప్రోత్సాహం లభించనుంది.
అలాగే సముద్ర ప్రాంతాల్లో భద్రత,సహకారాన్ని పెంపొందించాలనే 'సాగర్'(SAGAR)విజన్‌కు కూడా ఈ ప్రాజెక్టు తోడ్పడనుంది.
రూ.40 వేల కోట్లకు పైగా విలువైన ఈ ప్రాజెక్టు పనులను కోల్‌కతాలోని GRSE, గోవా షిప్‌యార్డ్ సంస్థలు పంచుకోనున్నాయి.
ఈ ఆర్డర్‌తో రెండు షిప్‌యార్డుల ఆర్డర్ బుక్ మరింత బలోపేతం కానుంది.
అంతేకాకుండా నౌకల తయారీకి అవసరమైన విడిభాగాలు,ఇతర పరికరాలను సరఫరా చేసే దేశీయ చిన్న,మధ్య తరహా పరిశ్రమలకు(MSMEలు)కూడా పెద్ద ఎత్తున పనులు లభించనున్నాయి.
వివరాలు
2030 నాటికి తొలి యుద్ధనౌక అందజేత లక్ష్యం
ఫలితంగా వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు ఏర్పడనున్నాయి.
ఈ ఎనిమిది యుద్ధనౌకల నిర్మాణ పనులను ఏడాది లోపే ప్రారంభించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
వీటిలో తొలి నౌకను 2030 నాటికి భారత నౌకాదళానికి అందజేయాలని ప్రణాళిక రూపొందించింది.
హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా తన కార్యకలాపాలను పెంచుతున్న నేపథ్యంలో భారత నౌకాదళం కూడా సముద్ర భద్రతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
ఇప్పటికే ఉన్న యుద్ధనౌకలకు అదనంగా కొత్త తరహా నౌకలను సమకూర్చుకుంటూ తన సామర్థ్యాన్ని పెంచుకుంటోంది.
వివరాలు
2030 నాటికి తొలి యుద్ధనౌక అందజేత లక్ష్యం
ప్రస్తుతం నౌకాదళంలో ఉన్న నీలగిరి క్లాస్ ఫ్రిగేట్లు, కొత్త తరం డిస్ట్రాయర్లు, ఫ్లీట్ సపోర్ట్ షిప్‌లకు ఈ ఎనిమిది స్టెల్త్ కార్వెట్లు తోడుకానున్నాయి.
దీంతో భారత నౌకాదళానికి మరింత అధునాతన సామర్థ్యాలు అందుబాటులోకి రానున్నాయి.
ముఖ్యంగా హిందూ మహాసముద్రంలో నిఘా, తీర ప్రాంతాల రక్షణ, శత్రు నౌకలు, జలాంతర్గాముల నుంచి ఎదురయ్యే ముప్పులను ఎదుర్కోవడంలో ఈ యుద్ధనౌకలు కీలక పాత్ర పోషించనున్నాయి.