Rupee Fall: డాలర్ దెబ్బకు రూపాయి విలవిల.. 96.18 వద్ద చారిత్రక కనిష్టానికి..
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో భారత రూపాయి మరింత ఒత్తిడికి గురైంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయి 96.18 వద్ద నమోదైంది. అంతర్జాతీయ మార్కెట్లో బాండ్ యీల్డ్స్ భారీగా పెరగడం, ముడి చమురు ధరలు ఎగబాకడం ఇందుకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారైన భారత్‌పై ఈ పరిణామాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పేర్కొంటున్నారు.
వివరాలు
ఆసియాలోనే అత్యంత బలహీన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూపాయి
రూపాయి వరుసగా ఐదో సెషన్‌లో కొత్త కనిష్ట స్థాయిని నమోదు చేయడం ఆందోళన కలిగిస్తోంది. సోమవారం ఒక్కరోజే రూపాయి 0.2 శాతం మేర పడిపోయి గత కనిష్టమైన 96.1350ను దాటింది. ఫిబ్రవరి 28న అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత నుంచి రూపాయి మొత్తం 5.5 శాతం మేర క్షీణించింది. దీంతో ఈ ఏడాది ఆసియాలోనే అత్యంత బలహీన ప్రదర్శన కనబరిచిన కరెన్సీగా రూపాయి నిలిచింది.