Indian rupee: కుప్పకూలిన రూపాయి.. చారిత్రక కనిష్టానికి భారత కరెన్సీ
ఈ వార్తాకథనం ఏంటి
భారత రూపాయి మరోసారి భారీ ఒత్తిడిని ఎదుర్కొంది. ఈ రోజు ఉదయం ట్రేడింగ్ ప్రారంభంలోనే 24 పైసలు పడిపోతూ, అమెరికా డాలర్‌తో పోలిస్తే రూ.90.56 అనే అతి తక్కువ స్థాయిని తాకింది. ఇండియా-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల నిరంతర ఉపసంహరణ ఇవన్నీ మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేస్తున్నాయని ట్రేడర్లు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు పెరగడంతో దిగుమతిదారులు డాలర్ కొనుగోళ్లను పెంచడం కూడా రూపాయిపై ఒత్తిడి పెరగడానికి కారణమైంది.
వివరాలు
ఇంటర్‌బ్యాంక్ మార్కెట్లో రూపాయి స్థితి
ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఈ రోజు ట్రేడింగ్‌ను రూ.90.43 వద్ద ప్రారంభించింది. తర్వాత కొంత సమయం గడవకుండానే అది రూ.90.56కి పడిపోయింది.గత ముగింపుతో పోలిస్తే ఇది 24 పైసల తగ్గుదల. గురువారం కూడా రూపాయి 38 పైసలు క్షీణించి రూ.90.32 వద్ద ముగిసింది. ఫిన్రెక్స్ ట్రెజరీ అడ్వైజర్స్‌కి చెందిన అనిల్ కుమార్ భన్సాలీ ప్రకారం, ఈ రోజు రూపాయి ట్రేడింగ్ పరిధి రూ.90 నుంచి రూ.90.60 మధ్య ఉండే అవకాశం ఉంది. అలాగే భారత్-అమెరికా వాణిజ్య చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో RBI చర్యలను మార్కెట్ జాగ్రత్తగా గమనిస్తుందని చెప్పారు.
వివరాలు
డాలర్ ఇండెక్స్ - క్రూడ్ ఆయిల్ ధరలు
ఆరు ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలం ఎంత ఉందో తెలియజేసే డాలర్ ఇండెక్స్ ఈ రోజు 0.02% లాభంతో 98.37 వద్ద ట్రేడవుతున్నది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ ధరలకు సూచికగా తీసుకునే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర కూడా ఫ్యూచర్స్ మార్కెట్లో 0.67% పెరిగి $61.69 వద్ద నమోదైంది. ఈ నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా గ్రీన్‌లోనే ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 170 పాయింట్లు, నిఫ్టీ 98 పాయింట్లు లాభపడి ఉపశమనం కలిగించాయి.
వివరాలు
ఏషియా ప్రాంతంలోనే ఎక్కువగా క్షిణించిన రూపాయి
ఈ ఏడాది ఇప్పటివరకు రూపాయి ఏషియా కరెన్సీల్లోనే అత్యంత బలహీనంగా నిలిచింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి దాదాపు 6% వరకు క్షీణించింది. అమెరికా భారత వస్తువులపై 50% వరకు భారీ సుంకాలు విధించడం, భారత ఎగుమతులను ప్రభావితం చేయడం, విదేశీ ఇన్వెస్టర్లను స్టాక్ మార్కెట్ నుంచి దూరం చేసేయడం—ఇవన్నీ రూపాయి బలహీనతకు ప్రధాన కారణాలుగా మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ రోజు రూపాయి మరింత దిగజారడానికి నాన్-డెలివరబుల్ ఫార్వర్డ్స్ మార్కెట్లో పెరిగిన డాలర్ డిమాండ్, దిగుమతిదారుల హెడ్జింగ్ అవసరాలు కూడా కారణమని ట్రేడర్లు చెబుతున్నారు.