stock market: భారత్‌కు షాక్.. ప్రపంచ మార్కెట్ విలువలో 7వ స్థానానికి పడిపోయిన స్టాక్ మార్కెట్
ఈ వార్తాకథనం ఏంటి
కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో పెరుగుతున్న పెట్టుబడుల ప్రభావంతో దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ భారీగా పుంజుకోగా, భారత స్టాక్ మార్కెట్ ప్రపంచ మార్కెట్ క్యాపిటలైజేషన్ (మార్కెట్ విలువ) ర్యాంకింగ్స్‌లో 7వ స్థానానికి పడిపోయింది. ఇటీవలే తైవాన్ భారత్‌ను అధిగమించి 5వ స్థానాన్ని దక్కించుకోగా, ఇప్పుడు దక్షిణ కొరియా కూడా ముందంజ వేసింది. బ్లూమ్‌బర్గ్ గణాంకాల ప్రకారం, దక్షిణ కొరియాలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ఏఐ రంగంలో కొనసాగుతున్న భారీ పెట్టుబడులు కొరియా మార్కెట్‌కు ఈ ఏడాది 85 శాతం వరకు విలువ పెరుగుదలను తీసుకొచ్చాయి.
వివరాలు
మార్కెట్ విలువలో 40 నుంచి 50శాతం వరకు వాటా కలిగి ఉన్న టీఎస్‌ఎంసీ కంపెనీ
దక్షిణ కొరియాకు చెందిన సెమీకండక్టర్ దిగ్గజాలు శాంసంగ్ ఎలక్ట్రానిక్స్,ఎస్‌కే హైనిక్స్ కంపెనీలు ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన సంస్థల జాబితాలో చేరాయి. ఈ రెండు సంస్థలు కొరియా కోస్పి సూచీలో గణనీయమైన వాటాను కలిగి ఉండటంతో మార్కెట్ విలువ పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి. ఇదే విధంగా తైవాన్‌లో టీఎస్‌ఎంసీ కంపెనీ ఒక్కటే ఆ దేశ మార్కెట్ విలువలో 40 నుంచి 50శాతం వరకు వాటా కలిగి ఉంది. అయితే, ఒకే సంస్థ లేదా కొద్ది కంపెనీలపై మార్కెట్ అధికంగా ఆధారపడటం వల్ల సూచీల పనితీరు కూడా వాటి ఫలితాలపైనే ఆధారపడుతుందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీంతో లాభాలు పెరిగే అవకాశాలతో పాటు నష్టాల ముప్పు కూడా ఎక్కువగా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.
వివరాలు
21శాతం లాభపడిన అమెరికా టెక్ ఆధారిత నాస్‌డాక్ సూచీ
మరోవైపు భారత్‌కు ఏఐ ఆధారిత పెట్టుబడుల ప్రవాహం పెద్దగా లభించకపోవడం మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లాభాలు అందించిన మార్కెట్లను పరిశీలిస్తే టెక్నాలజీ రంగ ఆధారిత కంపెనీలే ప్రధానంగా కనిపిస్తున్నాయి. 2026లో ఇప్పటివరకు దక్షిణ కొరియా కోస్పి సూచీ 99 శాతం ఎగబాకగా,తైవాన్ ప్రధాన సూచీ 55శాతం పెరిగింది. అమెరికా టెక్ ఆధారిత నాస్‌డాక్ సూచీ కూడా 21శాతం లాభపడింది.దీనికి విరుద్ధంగా భారత స్టాక్ మార్కెట్ 11శాతం నష్టపోయింది. గత పదేళ్లుగా వరుసగా సానుకూల రాబడులు నమోదు చేసిన భారత మార్కెట్, ఈ ఏడాది వార్షిక నష్టాన్ని నమోదు చేసే పరిస్థితి కనిపిస్తోంది.
వివరాలు
చమురు ధరల భారం.. ఆర్థిక వృద్ధిపై ఆందోళన
అంతేకాకుండా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం వల్ల దేశ ఆర్థిక వృద్ధి అంచనాలు తగ్గించబడగా, ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగాయి. అధిక ముడి చమురు ధరలు భారత్ కరెంట్ అకౌంట్ లోటు, చెల్లింపుల సమతుల్యత, ఆర్థిక లోటు, వృద్ధి రేటు, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. పశ్చిమ ఆసియా యుద్ధం త్వరలో ముగిసి, హోర్ముజ్ జలసంధి క్రమంగా తిరిగి తెరవబడుతుందనే అంచనాతో తమ ప్రాథమిక అంచనాలను రూపొందించినట్లు తెలిపింది.
వివరాలు
స్టాక్ మార్కెట్‌కు కొత్త సవాళ్లు.. చమురు, రుతుపవనాల ప్రభావం
ఇదిలా ఉండగా, భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఈ ఏడాది రుతుపవన వర్షాలు దీర్ఘకాల సగటులో 90 శాతం మాత్రమే ఉండొచ్చని అంచనా వేయడం మరో ఆందోళనగా మారింది. ఇది ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, కార్పొరేట్ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. 2025-26 నాల్గో త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, 2026-27 తొలి త్రైమాసికం సవాళ్లతో కూడుకుని ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గి ముడి చమురు ధరలు పడిపోతే భారత మార్కెట్‌కు అది పెద్ద ఊరటనిస్తుందని, అయితే ఇప్పటివరకు అలాంటి సంకేతాలు కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోందని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రధాన పెట్టుబడి వ్యూహకర్త డాక్టర్ వి.కె. విజయకుమార్ పేర్కొన్నారు.