LOADING...
Stock Market: మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీలు.. 800 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీలు.. 800 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

Stock Market: మధ్యాహ్నం తర్వాత కోలుకున్న సూచీలు.. 800 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
04:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్‌ మార్కెట్లు బుధవారం ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం తర్వాత కోలుకుని లాభాల్లో ముగిశాయి. ప్రారంభంలో అమ్మకాల ఒత్తిడి కనిపించినా, కనిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో సూచీలకు ఊతమిచ్చింది. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ ముడి చమురు ధర బ్యారెల్‌కు 110 డాలర్ల దిగువకు చేరడం కూడా సానుకూల ప్రభావం చూపింది. అలాగే పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొంత తగ్గుతున్నాయనే సంకేతాలు రావడంతో మదుపర్లలో నమ్మకం పెరిగింది. గత సెషన్‌లో 75,200 వద్ద ముగిసిన సెన్సెక్స్‌ బుధవారం ఉదయం సుమారు 400 పాయింట్ల నష్టంతో ప్రారంభమైంది. అనంతరం మరింత క్షీణించి ఇంట్రాడేలో దిగువ స్థాయిలను తాకింది.

వివరాలు 

నిఫ్టీ @ 23,659

అయితే మధ్యాహ్నం తర్వాత కొనుగోళ్లు పెరగడంతో సూచీ వేగంగా పుంజుకుంది. కనిష్ఠ స్థాయితో పోల్చుకుంటే సెన్సెక్స్‌ దాదాపు 800 పాయింట్లు ఎగబాకింది. చివరకు 117 పాయింట్ల లాభంతో 75,318 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా ఇదే ధోరణిని అనుసరించింది. ప్రారంభ నష్టాల నుంచి కోలుకుని చివరకు 41 పాయింట్లు పెరిగి 23,659 వద్ద స్థిరపడింది. రోజంతా జరిగిన ట్రేడింగ్‌లో హిటాచీ ఎనర్జీ, ఏబీబీ ఇండియా, సీజీ పవర్, సీమన్స్‌, మ్యాన్‌కైండ్ ఫార్మా కంపెనీల షేర్లు మంచి లాభాలు నమోదు చేశాయి. మరోవైపు పీఐ ఇండస్ట్రీస్‌, కేన్స్ టెక్నాలజీ, ఎల్‌టీఎమ్‌, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌, భారత్ ఎలక్ట్రికల్స్‌ కంపెనీల షేర్లు నష్టాల్లో ముగిశాయి.

వివరాలు 

153 పాయింట్లు పెరిగిన బ్యాంక్‌ నిఫ్టీ

రంగాల వారీగా చూస్తే బ్యాంకింగ్‌ షేర్లకు మద్దతు లభించింది. బ్యాంక్‌ నిఫ్టీ 153 పాయింట్లు పెరిగింది. మధ్య తరహా కంపెనీల సూచీ అయిన నిఫ్టీ మిడ్‌క్యాప్‌ సూచీ 301 పాయింట్లు లాభపడింది. మరోవైపు డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 96.82 వద్ద కొనసాగింది.

Advertisement