LOADING...
Stock Market: ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్
ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

Stock Market: ఉదయం లాభాలు.. మధ్యాహ్నం నష్టాలు: ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 26, 2026
04:01 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉదయం లాభాల దిశగా దూసుకెళ్లిన దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మధ్యాహ్నానికి నష్టాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు రావడం, క్రూడాయిల్ ధరలు ఏడు నెలల గరిష్ఠ స్థాయికి చేరుకోవడం, అలాగే ఎఫ్‌ఎమ్‌సీజీ, మెటల్, రియాల్టీ రంగాల్లో గరిష్ఠ స్థాయిల వద్ద మదుపర్లు లాభాల బుకింగ్‌కు దిగడం కారణంగా మార్కెట్‌పై ఒత్తిడి పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతుండటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ చివరికి పెద్ద మార్పుల్లేకుండా దాదాపు ఫ్లాట్‌గా ట్రేడింగ్ ముగించాయి.

వివరాలు 

500 పాయింట్లు పడిపోయిన సెన్సెక్స్ 

గత సెషన్‌లో 82,276 వద్ద ముగిసిన సెన్సెక్స్, గురువారం ఉదయం సుమారు 220 పాయింట్ల లాభంతో ప్రారంభమైంది. ఆరంభంలో మరింత ఎగబాకిన సూచీ, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడితో క్రమంగా వెనక్కి జారింది. రోజులో నమోదైన గరిష్ఠ స్థాయితో పోలిస్తే దాదాపు 500 పాయింట్లు పడిపోయింది. చివరకు 27 పాయింట్ల నష్టంతో 82,248 వద్ద సెన్సెక్స్ ముగిసింది. మరోవైపు నిఫ్టీ స్వల్పంగా 14 పాయింట్లు పెరిగి 25,496 వద్ద స్థిరపడింది.

వివరాలు 

144 పాయింట్లు పెరిగిన బ్యాంక్ నిఫ్టీ

సెన్సెక్స్, నిఫ్టీ సూచీలలో మ్యాన్‌కైండ్ ఫార్మా, ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఒరాకిల్ ఫిన్‌సర్వ్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంక్, ఫోర్టిస్ హెల్త్‌కేర్ షేర్లు లాభాలను నమోదు చేశాయి. ఇక సమ్మన్ క్యాపిటల్, డిక్సన్ టెక్నాలజీస్, సీడీఎస్‌ఎల్, కేఫిన్ టెక్నాలజీస్, ముత్తూట్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో ముగిశాయి. బ్యాంక్ నిఫ్టీ 144 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 392 పాయింట్ల లాభాన్ని నమోదు చేసింది. ఇదిలా ఉండగా, డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 90.91గా నమోదైంది.

Advertisement